తెలంగాణ

telangana

ETV Bharat / business

11 రెట్లు పెరిగిన ఐఓసీ లాభం

నిల్వలపై లాభాలతో ఈ ఆర్థిక ఏడాది రెండో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించింది ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఐఓసీ). స్టాండలోన్​ ప్రాతిపదికన రూ.6,227 కోట్ల నికర లాభం సంపాదించింది. 2019-20తో పోలిస్తే ఈ క్వార్టర్​లో 11 రెట్ల లాభాన్ని ఆర్జించింది.

ioc profits are increased as 11 times in 2020-21 second quarter
రెండో ​త్రైమాసికంలో 11 రెట్లు పెరిగిన ఐఓసీ లాభం

By

Published : Oct 31, 2020, 8:00 AM IST

నిల్వలపై అధిక లాభం రాగా.. జులై- సెప్టెంబరు త్రైమాసికానికి ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఐఓసీ) ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించింది. స్టాండలోన్‌ ప్రాతిపదికన రూ.6,227.31 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2019-20 ఇదే సమయంలో నమోదైన లాభం రూ.563.42 కోట్లతో పోలిస్తే ఈసారి 11 రెట్లు పెరగడం గమనార్హం. నిల్వలపై లాభాలతో పాటు అధిక రిఫైనింగ్‌ మార్జిన్లు, విదేశీ మారకపు ద్రవ్య లాభాలు కూడా ఇందుకు దోహదం చేశాయి.

అప్పుడు కొనుగోలు చేసి..

ఒక బ్యారెల్‌ ముడి చమురును ఇంధనంగా మార్చడం (స్థూల రిఫైనింగ్‌ మార్జిన్‌) ద్వారా సమీక్షా త్రైమాసికంలో 8.62 డాలర్లను కంపెనీ ఆర్జించింది. ఏడాది క్రితం ఇది 1.28 డాలర్లు మాత్రమే. జులై- సెప్టెంబరులో పెట్రోలియం ఉత్పత్తుల తయారీ కోసం మే, జూన్‌లో తక్కువ ధరకు ముడి చమురు ధరను కొనుగోలు చేయడం వల్ల రూ.7,400 కోట్ల లాభాన్ని కంపెనీ ఆర్జించింది. కిందటేడాది ఇదే సమయంలో చమురు నిల్వలపై రూ.1807 కోట్ల మేర నష్టం వాటిల్లడం గమనార్హం. ఒక కంపెనీ ముడి చమురును ఫలానా ధరకు కొనుగోలు చేశాక.. దానిని ఇంధన ఉత్పత్తులుగా మార్చే నాటికి ధర పెరిగితే నిల్వలపై లాభం వచ్చినట్లుగా, ధర తగ్గితే నిల్వలపై నష్టం వాటిల్లినట్లుగా చెబుతారు.

వేగం పుంజుకుంది...

విదేశీ మారకపు ద్రవ్య లాభం రూపేణా రూ.627 కోట్లు ఐఓసీకి వచ్చాయి. కిందటేడాది ఈ విభాగ నష్టం రూ.1,135 కోట్లుగా ఉంది. కరోనా వైరస్‌ పరిణామాలు, లాక్‌డౌన్‌తో సగానికి తగ్గిన ఇంధన గిరాకీ ఇప్పుడు వేగంగా పుంజుకుని సాధారణ స్థితికి వచ్చిందని ఐఓసీ ఛైర్మన్‌ శ్రీకాంత్‌ మాధవ్‌ వైద్య తెలిపారు. సమీక్షా త్రైమాసికంలో కార్యకలాపాల ద్వారా ఆదాయం రూ.1.15 లక్షల కోట్లకు తగ్గింది. ఏడాదిక్రితం ఆదాయం రూ.1.32 లక్షల కోట్లుగా నమోదైంది. పానిపట్‌ రిఫైనరీ వద్ద పెట్రోలియం యూనిట్‌ ఏర్పాటుకు, బొనగైగావ్‌ రిఫైనరీ సామర్థ్యం పెంపునకు రూ.5,000 కోట్లు వెచ్చించేందుకు డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపిందని ఐఓసీ వెల్లడించింది. అలాగే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.20,000 కోట్ల రుణాన్ని తీసుకునేందుకు కూడా అంగీకరించిందని వెల్లడించింది.

ఇదీ చూడండి:ఏ దేశ షేర్లలోనైనా.. పెట్టుబడులు పెట్టే వీలు

ABOUT THE AUTHOR

...view details