అతి తక్కువ సమయంలో దేశీయ ఆటోమొబైల్ మార్కెట్లో ఆదరణ పొందిన ఘనత కియా మోటార్స్ ఇండియా సొంతం. కియా కారు కోసం ఇప్పటికీ రెండు-మూడు నెలలు ఎదురుచూపులు తప్పని పరిస్థితి. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో నెలకొల్పిన యూనిట్ ద్వారా ఈ సంస్థ సెల్టోస్, సోనెట్ మోడళ్లను దేశీయ మార్కెట్లో విక్రయించటం సహా 70 దేశాలకు ఎగుమతి చేస్తోంది. కొవిడ్-19 వల్ల వినియోగదార్ల ఆలోచనల్లో మార్పు వచ్చిందని, ప్రతి ఒక్కరూ సొంత వాహనాల్లో ప్రయాణాలను ఇష్టపడుతున్నారని కియా మోటార్స్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ టే-జిన్ పార్క్ 'ఈనాడు'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు. దీనివల్ల ప్రారంభస్థాయి(ఎంట్రీ లెవల్), నాలుగు మీటర్ల లోపు(సబ్-4 మీటర్) కార్లకు గిరాకీ అధికంగా కనిపిస్తోందని తెలిపారు. వినియోగదార్లలో వస్తున్న ఈ మార్పులు, ఇష్టాఇష్టాలకు అనుగుణంగా కొత్త మోడళ్లు తీసుకొస్తామని తెలిపారు. ఇంటర్వ్యూ విశేషాలు..
కొవిడ్-19 విసిరిన సవాళ్ల నేపథ్యంలోనూ కియా మోటార్స్ ఇండియా మెరుగైన అమ్మకాలు నమోదు చేస్తోంది. ఇదెలా సాధ్యం
కియా బ్రాండుకు భారతదేశంలో లభిస్తున్న ఆదరణపై మేమెంతో సంతోషంగా ఉన్నాం. కొవిడ్-19, దీర్ఘకాలిక లాక్‌డౌన్, ఇతర సవాళ్లు ఎదురైనప్పటికీ గత ఏడాదిలో 1.40 లక్షల కార్లు విక్రయించాం. ఇబ్బందులు ఎదురైనా మా వ్యాపార ప్రణాళిక నుంచి పక్కకు వెళ్లలేదు. ముందుగా నిర్ణయించిన ప్రకారమే సోనెట్ కారు విడుదల చేశాం. డీలర్లు, డీలర్ల వద్ద పనిచేసే సిబ్బంది సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకున్నాం. ‘కియా కార్ కేంపెయిన్’ కార్యక్రమాన్ని చేపట్టి వినియోగదార్లకు అండగా నిలిచాం. ఆన్‌లైన్లో వినియోగదార్లకు నిరంతరం అందుబాటులో ఉన్నాం. కార్ల ఉత్పత్తిని పెంచటానికి, సత్వరం డెలివరీ ఇవ్వటానికి చర్యలు చేపట్టాం. తద్వారా అమ్మకాల విషయంలో మెరుగైన స్థానంలో నిలిచాం.
ఆంధ్రప్రదేశ్‌లో ఆటోమొబైల్ పరిశ్రమ లేదు. అనుబంధ పరిశ్రమలు లేవు. కానీ మీరు విజయవంతంగా ముందుకు సాగుతున్నారు. ఎలా అనిపిస్తోంది ఈ ప్రయాణం..
ఆటోమొబైల్ పరిశ్రమ స్థాపనకు అనువైన మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీ, సరకు రవాణా మార్గాలు, నైపుణ్యం గల మానవ వనరులు ఉండటం వల్ల మేం ఆంధ్రప్రదేశ్‌ని ఎంచుకున్నాం. అంతేగాక చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్ నగరాలకు అనంతపురం దగ్గరగా ఉండటం అదనపు ఆకర్షణ. అన్నింటికీ మించి రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ఎంతో ముఖ్యమైనది. అందువల్ల ఆంధ్రప్రదేశ్‌లో కియా కార్ల యూనిట్ పెట్టాలని మేం తీసుకున్న నిర్ణయం ఎంతో సరైనదని అనిపిస్తోంది.
కియా కార్లలో స్థానికంగా తయారయ్యేది ఎంత ? పూర్తిగా ఇక్కడే తయారీకి ఎంత సమయం పడుతుంది
సాధ్యమైనంత వరకూ కియా కార్లలో భారతదేశంలోనే తయారైన విడిభాగాలు వినియోగిస్తున్నాం. అనంతపురంలోని మా ప్లాంటు చుట్టూ విడిభాగాల తయారీ యూనిట్ల కోసం ‘వెండార్ పార్క్’ ఏర్పాటు చేశాం. అందుబాటు ధరకు భారతదేశంలో వినియోగదార్లు ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. తక్కువ ధరలో కార్లు అందించాలంటే స్థానికంగా తయారు చేయటం ఎంతో అవసరం. మా ప్రాధాన్యం కూడా అదే.
కియా సోనెట్‌కు ఆదరణ ఎలా ఉంది. కియా నుంచి తదుపరి ఏ మోడల్ రాబోతోంది
కాంపాక్ట్-ఎస్‌యూవీల్లో అత్యధికంగా అమ్మకాలు నమోదు చేస్తున్న మోడల్‌గా కియా సోనెట్ ఉంది. ప్రస్తుతం మా దృష్టి అంతా పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా కార్లను అందించటం ఎలా..? అనే దానిపై ఉంది. కొవిడ్-19 వల్ల ప్రజల ఆలోచనల్లో, అభిరుచుల్లో ఎంతో మార్పు వచ్చింది. ఈ పరిస్థితులను అధ్యయనం చేస్తున్నాం. దీనికి తగ్గట్లుగా తగిన కొత్త మోడల్‌ను ఆవిష్కరిస్తాం.
చిన్న కార్లు, సెడాన్ విభాగాల్లోకి అడుగుపెట్టే ఆలోచన ఉందా