ఈ ఏడాది చివరి ద్వైమాసిక ద్రవ్య పరపతి కమిటీ(ఎంపీసీ) సమీక్షలో కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతూ ఆర్బీఐ తీసుకున్న నిర్ణయంపై నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు ద్రవ్యోల్బణం పెరుగుతుండటం వల్ల ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా.. వృద్ధికి ఊతమందించేందుకు తక్కువ వడ్డీ రేట్లను కొనసాగించడంపై సానుకూలంగా స్పందిస్తున్నారు.
ఎంపీసీ నిర్ణయాలు ప్రధానంగా వృద్ధి రేటు రికవరీపై దృష్టిసారించాయని.. ఇవి సప్లయి పెరిగేందుకు కూడా తోడవుతాయని ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్ ఫిక్సెడ్ఇన్కం విభాగాధిపతి రాజీవ్ రాధాకృష్ణ అన్నారు.
వృద్ధి రేటు అంచనాలు సానుకూలంగా మారుతున్నప్పటికీ.. కరోనా కారణంగా నెలకొన్న పరిస్థితులు పూర్తిగా తొలగిపోలేదని పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ అధ్యక్షురాలు సంగీతా రెడ్డి అన్నారు. ఈ కారణంగా వచ్చే ఏడాది కూడా ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వాల నుంచి మరిన్ని ఉద్దీపనలు అవసరమవుతాయని అభిప్రాయపడ్డారు.
ప్రస్తుత పరిస్థితుల్లో వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచడం ఆశ్చర్యం కలిగించనప్పటికీ.. ఆర్థిక వృద్ధి బలోపేతం కోసం అకామడేటివ్ మోనిటరీ పాలసీ విధానాన్ని పాటిస్తున్నందుకు ఎంపీసీని అభినందించాల్సిన అవసరముందని అసోచామ్ సెక్రెటరీ జనరల్ దీపక్ సూద్ అన్నారు.