తెలంగాణ

telangana

ETV Bharat / business

Indian startups: అంకురాల్లోకి రూ.49 వేల కోట్లు - ఐపీఓ

భారత అంకుర సంస్థలు(Indian startups) ఈ ఏడాది తొలి త్రైమాసికంలో దాదాపు 6.5 బిలియన్​ డాలర్లు (రూ.49వేల కోట్లు) నిధులు సమీకరించినట్లు నాస్​కామ్​ పీజీఏ ల్యాబ్స్​ నివేదిక వెల్లడించింది. ఇందులో 11 కొత్త యూనికార్న్‌లు(Unicorn companies in India 2021) ఆవిర్భవించినట్లు తెలిపింది. అత్యధికంగా స్విగ్గీ 800 మిలియన్​ డాలర్లు సమీకరించినట్లు పేర్కొంది.

Indian start-ups
భారత అంకుర సంస్థలు

By

Published : Aug 23, 2021, 6:47 AM IST

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌- జూన్‌ త్రైమాసికంలో భారత అంకుర సంస్థలు(Indian startups) దాదాపు 6.5 బిలియన్‌ డాలర్లు (రూ.49000 కోట్లు) నిధులు అందుకున్నాయని, ఇందులో 11 సంస్థలు యూనికార్న్‌(Unicorn companies in India 2021) (100 కోట్ల డాలర్ల సంస్థ) జాబితాలో చేరాయని నాస్‌కామ్‌-పీజీఏ ల్యాబ్స్‌ నివేదిక వెల్లడించింది. జనవరి- మార్చితో పోలిస్తే జూన్‌ త్రైమాసికంలో పెట్టుబడుల ఒప్పందాలు 2 శాతం పెరిగి 160కు చేరాయి.అత్యధికంగా ఆహార డెలివరీ సంస్థ స్విగ్గీ 800 మిలియన్‌ డాలర్లు సమీకరించింది. షేర్‌చాట్‌ (502 మి.డాలర్లు), బైజూస్‌ (340 మి.డాలర్లు), ఫార్మ్‌ఈజీ (323 మి.డాలర్లు), మీషో (300 మి.డాలర్లు), పైన్‌ ల్యాబ్స్‌ (285 మి.డాలర్లు), డెలివరీ (277 మి.డాలర్లు), జెటా (250 మి.డాలర్లు), క్రెడ్‌ (215 మి.డాలర్లు), అర్బన్‌ కంపెనీ (188 మి.డాలర్లు) తర్వాతి స్థానాల్లో నిలిచాయి. అర్బన్‌ కంపెనీ, క్రెడ్‌, మీషో, గ్రో, షేర్‌చాట్‌, ఫార్మ్‌ఈజీ, జెటా, బ్రౌజర్‌స్టాక్‌, మోగ్లిక్స్‌, గప్‌షప్‌, ఛార్జ్‌బీ యూనికార్న్‌లుగా అవతరించాయి.

వెంచర్‌ క్యాపిటల్‌ సంస్థల నుంచి రూ.1.3 లక్షల కోట్లు

ఈ ఏడాది జనవరి- జులై మధ్య భారత అంకుర వ్యవస్థలోకి వెంచర్‌ క్యాపిటల్‌ సంస్థలు 17.2 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.1.3 లక్షల కోట్లు) చొప్పించాయని ఇండియన్‌ ప్రైవేట్‌ ఈక్విటీ అండ్‌ వెంచర్‌ క్యాపిటల్‌ అసోసియేషన్‌ (ఐవీసీఏ), వెంచర్‌ ఇంటెలిజెన్స్‌ (వీఐ) గణాంకాలు తెలిపాయి. వెంచర్‌ క్యాపిటల్‌ సంస్థలు 2019లో పెట్టిన 13 బిలియన్‌ డాలర్లు, 2020లో చేసిన 11.1 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులతో పోలిస్తే, ఈసారి 7 నెలల్లోనే అధికంగా రావడం విశేషం. భారీ వెంచర్‌క్యాపిటల్‌ ఒప్పందాల్లో ఉడాన్‌, లెన్స్‌కార్ట్‌, జొమాటో, స్విగ్గీ, ఫార్మ్‌ఈజీ, మీషో, పైన్‌ ల్యాబ్స్‌, జెటా, క్రెడ్‌, రేజర్‌పే, హెల్తీఫైమీ, బైజూస్‌, అన్‌అకాడమీ, ఎరుడిటస్‌, వేదాంతు, డంజో, బైరా 91, బోట్‌, మామెర్త్‌, మైగ్లామ్‌, యునిఫోర్‌ సాఫ్ట్‌వేర్‌ సిస్టమ్స్‌, యెల్లో, ఎంట్రోపిక్‌ వంటి సంస్థలు ఉన్నాయి.

రూ.10,000 కోట్ల సమీకరణ లక్ష్యంతో ఐపీఓలకు 3 బీమా సంస్థలు

రాబోయే నెలల్లో తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ)ల ద్వారా మూడు బీమా రంగ సంస్థలు రూ.10,000 కోట్లకు పైగా సమీకరించడానికి సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ వద్ద పాలసీబజార్‌ను నిర్వహించే పీబీ ఫిన్‌టెక్‌, స్టార్‌ హెల్త్‌ అండ్‌ అలైడ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ, మెడి అసిస్ట్‌ హెల్త్‌కేర్‌ సర్వీస్‌ ముసాయిదా పత్రాలు దాఖలు చేశాయి. పీబీ ఫిన్‌టెక్‌ రూ.6017 కోట్లు, స్టార్‌ హెల్త్‌ రూ.3000 కోట్లు, మెడి అసిస్ట్‌ రూ.840-1000 కోట్ల ఇష్యూలతో రానున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 40కు పైగా కంపెనీలు ఐపీఓ మార్కెట్‌ ద్వారా రూ.70000 కోట్ల వరకు సమీకరించాయి. ఈ నెలలో ఇప్పటికే స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో నాలుగు కంపెనీలు నమోదవ్వగా.. రూ.5000 కోట్లు సమీకరించిన అయిదో సంస్థ నువోకో విస్టాస్‌ నేడు ఎక్స్ఛేంజీల్లో నమోదుకానుంది. రూ.4000 కోట్లకు పైగా సమీకరించేందుకు 24 కంపెనీలు ఈనెలలోనే ముసాయిదా పత్రాలను సెబీకి దాఖలు చేశాయి. ఈ ఏడాదిలో 100కు పైగా పబ్లిక్‌ ఇష్యూలు పూర్తవుతాయని ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్లు అంచనా వేస్తున్నారు.

ఇదీ చూడండి:Google PlayStore: ఈ బిట్‌కాయిన్‌ యాప్స్‌తో జాగ్రత్త..!

ABOUT THE AUTHOR

...view details