ఔషధ ఎగుమతులపై కరోనా వైరస్ ప్రభావం చూపింది. గత ఆర్థిక సంవత్సరం (2019-20)లో నిర్దేశించుకున్న 22 బిలియన్ డాలర్ల (సుమారు రూ.1.65 లక్షల కోట్ల) ఎగుమతుల లక్ష్యానికి చేరలేని స్థితి కల్పించింది. మనదేశం నుంచి గత ఆర్థిక సంవత్సరంలో 20.58 బిలియన్ డాలర్ల (రూ.1.54 లక్షల కోట్ల) ఔషధ ఎగుమతులు నమోదు చేసినట్లు ఫార్మాగ్జిల్ (ఫార్మాసూటికల్స్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్) వెల్లడించింది. 2018-19 ఎగుమతులు 19.13 బిలియన్ డాలర్లతో పోల్చితే 7.57 శాతం వృద్ధి నమోదు కావడం ఊరట కల్పించే విషయం.
2017-18తో పోలిస్తే, 2018-19 ఔషధ ఎగుమతుల్లో 10.72 శాతం వృద్ధి నమోదైంది. ఈసారి వృద్ధి కాస్త తగ్గింది. గత ఆర్థిక సంవత్సరం మొదటి 9 నెలలు సానుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ, కరోనా వైరస్ (కొవిడ్-19) వల్ల ఎదురైన అడ్డంకులతో నాలుగో త్రైమాసికంలో దాదాపు రెండు నెలల పాటు ఇతర దేశాలకు ఆశించిన రీతిలో మందుల ఎగుమతులు సాధ్యం కాలేదు. అయినా కూడా ఎగుమతుల్లో 7.57 శాతం వృద్ధి సాధించగలిగినట్లు ఫార్మాగ్జిల్ డైరెక్టర్ జనరల్ ఆర్.ఉదయ భాస్కర్ పేర్కొన్నారు. మొదటి మూడు త్రైమాసికాల్లో ఎగుమతులు వరుసగా 11.21%, 8.69%, 14.64% చొప్పున పెరిగాయి. నాలుగో త్రైమాసికంలో మాత్రం 2.97 శాతం క్షీణత నమోదైంది. ఔషధ ఎగుమతులు ఒక్క మార్చి నెలలోనే 23.34 శాతం తగ్గిపోయాయి.
ఉత్తర అమెరికా వాటా అధికం
మన ఔషధాలకు ఉత్తర అమెరికా పెద్ద విపణి. వార్షిక ఎగుమతుల్లో ఉత్తర అమెరికా వాటా 34 శాతం వరకు ఉంటుంది. ఉత్తర అమెరికా దేశాలకు గత ఆర్థిక సంవత్సరంలో ఎగుమతులు 15.11 శాతం పెరిగాయి. రెండో పెద్ద మార్కెట్ అయిన ఆఫ్రికా దేశాలకు 2.24 శాతం అధికంగా ఔషధ ఎగుమతులు జరిగాయి. టాంజానియా ఎగుమతులు అనూహ్యంగా 30.18 శాతం పెరిగాయి. ఔషధ ఎగుమతులు ఐరోపా దేశాలకు 4.54 శాతం, రష్యా 13.8 శాతం, సీఐఎస్ దేశాలకు 14.8 శాతం చొప్పున పెరిగాయి. అదే విధంగా జపాన్ ఎగుమతులు 11.66 శాతం పెరిగాయి.