సాధారణంగా కార్లు ఉన్నవాళ్లు ఎక్కువ సేపు అందులో తిరుగుతుంటారని అందరం భావిస్తుంటాం. అయితే అది తప్పని 'సెంటర్ ఫర్ సైన్స్ ఆండ్ ఎన్విరాన్మెంట్' చేసిన ఓ సర్వేలో వెల్లడైంది.
ఏడాది కాలం పాటు నిర్వహించిన ఈ సర్వే ప్రకారం.. దేశంలో కార్లు సగటున 95 శాతం సమయం పార్కింగ్‌లో ఉంటే 5 శాతం సమయం మాత్రమే రోడ్లపై నడుస్తున్నట్లు తెలిసింది. అంటే సగటున 8,360 గంటలు పార్కింగ్‌లో ఉంటే.. 400 గంటలు మాత్రమే నడుస్తున్నాయని సర్వే పేర్కొంది.
పార్కింగ్ కోసం పట్టణ ప్రాంతాల్లో బంజరు భూములకు ఎక్కువగా డిమాండ్ ఉన్న విషయాన్ని నివేదిక హైలెట్ చేసింది. సర్వే పేర్కొన్న గణాంకాల ప్రకారం.. అదనపు పార్కింగ్ స్థలం దిల్లీలో 471, చెన్నైలో 100, ఛండీగఢ్‌లో 58, గురుగ్రామ్‌లో 179 ఫుట్‌బాల్ మైదానాలకు సమానంగా ఉన్నట్లు తెలిసింది.
ఇదిలా ఉంటే.. పార్కింగ్ స్థలాల్లో కార్లు, ద్విచక్ర వాహనాలే 85 శాతం వాటాను ఆక్రమిస్తున్నాయి. అవి 4 నుంచి 15 శాతం ప్రయాణికుల అవసరాలను తీరుస్తున్నాయి. బస్సులు కేవలం 4-5 శాతం పార్కింగ్ వాటాను ఆక్రమిస్తూ.. కార్లు, బైకుల కన్నా.. 20 రెట్ల ఎక్కువ ప్రయాణికులను అవసరాలను తీరుస్తున్నట్లు సర్వే పేర్కొంది.