భాజపా సీనియర్ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మృతి పట్ల సంతాపం తెలిపారు పలువురు పారిశ్రామిక వేత్తలు. ఆర్థిక మంత్రిగా జైట్లీ చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. జైట్లీని గొప్ప సంస్కరణకర్తగా, రాజనీతిజ్ఞుడిగా అభివర్ణించారు.
తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ దిల్లీ ఎయిమ్స్‌లో చేరిన జైట్లీ.. పరిస్థితి విషమించి నేడు తుదిశ్వాస విడిచారు.
"జైట్లీ గొప్ప వక్త, పార్లమెంటరీయన్, ప్రజా పథకాల రూపకర్త. ప్రజలతో మమేకమై పని చేసే సామర్థ్యం ఆయన సొంతం. అభివృద్ధి పథంలో భారత్ దూసుకెళ్లేందుకు ఆయనొక ఉత్ప్రేరకంగా పనిచేశారు." - గౌతమ్ అదానీ, అదానీ గ్రూప్ ఛైర్మన్
గౌతమ్ అదానీ ట్వీట్
దేశం ఒక గొప్ప నాయకుడిని, న్యాయ కోవిదుడిని కోల్పోయిందని భారతీ ఎయిర్టెల్ ఛైర్మన్ సునీల్ మిత్తల్ పేర్కొన్నారు.
" జైట్లీ తీసుకునే నిర్ణయాలు చాలా మందిని ఆకర్షిస్తాయి. కొన్నిసార్లు ప్రత్యర్థి పార్టీలు సైతం సంక్లిష్ట పరిస్థితుల్లో ఆయన విధానాలనే అనుసరించేవి. అయన న్యాయ చతురత, సలహాలు కుటుంబ సమస్యల పరిష్కారానికి, వక్తిగత వ్యవహారాలన్నింటికీ ఉపయోగపడేవి. " - సునీల్ మిత్తల్, భారతీ ఎయిర్టెల్ ఛైర్మన్