గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రీన్ ఎనర్జీ కాంప్లెక్స్ అభివృద్ధి పనులు ప్రారంభమైనట్లు సంస్థ అధినేత ముకేశ్ అంబానీ (Mukesh Ambani) పేర్కొన్నారు. ఇందుకోసం రూ.75 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు చెప్పారు. 'ఇంటర్నేషనల్ క్లైమేట్ సమిట్ 2021'లో వర్చువల్‌గా పాల్గొన్న ముకేశ్ ఈ విషయాలు తెలిపారు.
"పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి వ్యాపారానికి సంబంధించి ఈ ఏడాదే ప్రణాళిను ప్రకటించాం. ఇది రిలయన్స్‌తో పాటు భారత్‌కూ అత్యంత విలువైన వ్యాపారంగా మారనుంది. ఇప్పటికే జామ్‌నగర్‌లో ధీరూభాయ్ అంబానీ ఎనర్జీ గిగా కాంప్లెక్స్ అభివృద్ధిని ప్రారంభించాం. మొత్తం 5 వేల ఎకరాల్లో దీనిని నిర్మిస్తున్నాం. "
- ముకేశ్ అంబానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత
కాంప్లెక్స్ మొత్తం విద్యుత్ ఉత్పత్తి లక్ష్యం 450 గిగావాట్లు కాగా.. అందులో 2030 నాటికి 100 గిగావాట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధిస్తామని ఆయన పేర్కొన్నారు. జామ్‌నగర్ కాంప్లెక్స్‌లో 4 గిగా ఫ్యాక్టరీలు ఉన్నట్లు వివరించారు.
'గ్రీన్ హైడ్రోజన్ ఎకోసిస్టమ్ (Green Hydrogen Ecosystem) అభివృద్ధికి భారత్ ప్రణాళికలు వేస్తోంది. ఈ లక్ష్యాన్ని సాధించడంలో భారత్ రిలయన్స్ ఇండస్ట్రీస్ పూర్తిగా మద్దతు ఇస్తోంది.' అని ముకేశ్ అంబానీ తెలిపారు.
పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి (Renewable energy) విభాగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆకర్షణీయమైన దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉన్నట్లు అంబానీ పేర్కొన్నారు. 2022 నాటికి 175 గిగా వాట్ల పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టకున్న భారత్.. ఇప్పటికే 100 గిగా వాట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించినట్లు గుర్తు చేశారు.
ఇదీ చదవండి:JioPhone Next: రూ.500కే జియో స్మార్ట్‌ఫోన్?