ఐసీఐసీఐ బ్యాంక్ ఫలితాల్లో రాణించింది. 2020, సెప్టెంబరు 30తో ముగిసిన త్రైమాసికంలో బ్యాంకు ఏకీకృత నికర లాభం నాలుగింతలై రూ.4,882 కోట్లకు చేరుకుంది. ప్రధాన ఆదాయ వృద్ధికి తోడు, కరోనా సంబంధిత ప్రభావానికి తక్కువ కేటాయింపులే చేయడం ఇందుకు దోహదం చేసింది. ఏడాది కిందట ఇదే త్రైమాసికంలో లాభం రూ.1,131 కోట్లుగా నిలిచింది. స్టాండలోన్ ఖాతాల ప్రకారం నికర లాభం రూ.655 కోట్ల నుంచి రూ.4,251 కోట్లకు పెరిగింది. బ్యాంకు చరిత్రలో అత్యధిక త్రైమాసిక వృద్ధి ఇదే.
పెరిగిన నికర వడ్డీ ఆదాయం..
నికర వడ్డీ మార్జిన్(ఎన్‌ఐఎమ్) 0.10 తగ్గి 3.57 శాతానికి చేరినప్పటికీ ప్రధాన నికర వడ్డీ ఆదాయం(ఎన్‌ఐఐ) 16 శాతం వృద్ధితో రూ.9,366 కోట్లకు చేరడం విశేషం. గత రెండేళ్లలో కొత్త యాజమాన్యం ఆధ్వర్యంలో అనుసరించిన వ్యూహం కారణంగా అధిక లాభ వృద్ధి నమోదైందని బ్యాంకు ప్రెసిడెంట్ సందీప్ బాత్రా పేర్కొన్నారు.