తెలంగాణ

telangana

ETV Bharat / business

సైబర్​ మోసాల్లో పోయిన డబ్బు తిరిగి రావాలంటే... - ఆర్బీఐ

సైబర్ మోసాలు.. ఈ మధ్య కాలంలో తరచూ వినబడుతున్న పదం. సైబర్​మోసాల్లో డబ్బులు కోల్పోతే వాటికి బాధ్యులెవరు? ఈ మోసాల గురించి బ్యాంకింగ్​ నియంత్రణ సంస్థ ఆర్బీఐ ఏం చెబుతోంది?

సైబర్​ మోసాలు

By

Published : Sep 11, 2019, 7:09 AM IST

Updated : Sep 30, 2019, 4:49 AM IST

ఇటీవలి కాలంలో డిజిటల్​ లావాదేవీలు భారీగా పెరిగాయి. అదే అదునుగా డిజిటల్ మోసాలు చేసే వారి సంఖ్యా పెరుగుతోంది. జేబులో డబ్బు కొట్టేస్తే.. ఆ నష్టాన్ని సదరు వ్యక్తే భరించాల్సి ఉంటుంది. అయితే హ్యాకర్ల ద్వారా గానీ మరే ఇతర కారణాలతోనైనా అక్రమ డిజిటల్ లావాదేవీలు జరిగితే వాటి బాధ్యత ఎవరిదనే సందేహాలు చాలా మందికి ఉంటాయి.

ఇలాంటి మోసాలకు సంబంధించి ఆర్బీఐ వివరణాత్మక మార్గదర్శకాలను తీసుకువచ్చింది. ఇందులో సైబర్​ మోసాల బాధ్యత పరిధిని వివరించింది. వినియోగదారుల్లో డిజిటల్​ లావాదేవీల పట్ల విశ్వాసం క‌ల్పించేందుకు భద్రతా వలయాన్ని ఏర్పాటు చేసింది.

బ్యాంకులదే పూర్తి బాధ్యత..

బ్యాంకుల నిర్లక్ష్యం లేదా లోపం వల్ల అక్రమ లావాదేవీ జరిగితే, ఖాతాదారుడు ఫిర్యాదు చేసినా చెయ్యకపోయినా పూర్తి బాధ్యత బ్యాంకులదే. అలాంటి లావాదేవీల్లో నష్టపోయిన మొత్తాన్ని ఖాతాదారుడు పూర్తిగా తిరిగి పొందవచ్చు.

ఖాతాదారుడు ప్రమేయంగానీ, బ్యాంకుల నిర్లక్ష్యంగానీ లేకుండా కేవలం థర్డ్​ పార్టీ మోసం లేదా వ్యవస్థాగత లోపం వల్ల మోసం జరిగితే నిబంధన మరోలా ఉంటుంది. అక్రమ ట్రాన్సాక్షన్​పై ఖాతాదారుడు బ్యాంకు నుంచి సమాచారం వచ్చిన మూడు పనిదినాల్లోగా ఫిర్యాదు చేస్తే.. ఆ లావాదేవీ మొత్తానికి ఖాతాదారుడి బాధ్యత లేదు. ఈ పూర్తి మొత్తానికి బ్యాంకులు భరోసానిస్తాయి. అక్రమ లావాదేవీల విషయంలో ఖాతాదార్ల ప్రమేయాన్ని రుజువు చేసే బాధ్యత బ్యాంకులపైనే ఉంటుంది.

మీరు అప్రమత్తంగా లేకపోతే..

ఆన్‌లైన్‌ లావాదేవీలు నిర్వహించేందుకు అవసరమైన వ్యక్తిగత సమాచారాన్ని రహస్యంగా ఉంచుకోవాల్సిన పూర్తి బాధ్యత ఖాతాదారుడిదే. ఖాతాదారుల నిర్లక్ష్యం వల్ల లేదా అవగాహన లోపం వల్ల వ్యక్తిగత వివరాలు గోప్యంగా ఉంచుకోలేకపోతే.. ఫిర్యాదు చేసే వరకు జరిగిన లావాదేవీలకు పూర్తి బాధ్యత ఖాతాదారుడిదే. బ్యాంకులు ఆ లావాదేవీలకు సంబంధించిన నష్టాన్ని భరించవు. ఫిర్యాదు చేసిన తర్వాత ఏదైనా అక్రమ లావాదేవీ జరిగితే ఖాతాదారుడికి ఎటువంటి బాధ్యత ఉండదు. ఆ తర్వాత జరిగే లావాదేవీల్లో నష్టపోయిన సొమ్మును తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత బ్యాంకులదే.

సైబర్ మోసాల్లో చిక్కుకోకుండా..

  • లావాదేవీలకు సంబంధించిన అన్ని సంక్షిప్త సందేశాలు మీ బ్యాంకు ఖాతాలో నమోదైన మొబైల్‌కు వచ్చేలా చూసుకోండి.
  • అపరిచిత వ్యక్తులు మీకు ఫోన్‌ చేసి, డెబిట్‌/క్రెడిట్‌ కార్డు నెంబరు, సీవీవీ, పాస్‌వర్డ్‌, ఓటీపీ, మొబైల్‌ సిమ్‌ నెంబరు వంటివి అడిగితే.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ వివరాలు చెప్పొద్దు.
  • తరచూ మీ ఏటీఎం/మొబైల్‌ బ్యాంకింగ్‌/ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ పాస్‌వర్డ్‌లు మారుస్తూ ఉండాలి.
  • వెంటనే ఫిర్యాదు చేయడానికి వీలుగా, మీ ఖాతా ఉన్న బ్యాంకు టోల్‌ ఫ్రీ నెంబరు, వెబ్‌సైటు తదితర వివరాలు అందుబాటులో ఉంచుకోండి.
  • హోటళ్లు, పెట్రోలు బంకుల్లో లావాదేవీలు నిర్వహించేటప్పుడు... మీరే స్వయంగా పిన్‌ నమోదు చేయండి.
  • ఉచిత వైఫై కేంద్రాల్లోనూ, నెట్‌ సెంటర్లలోనూ, ఆన్‌లైన్‌ ఆర్థిక లావాదేవీలు నిర్వహించవద్దు. మీ స్మార్ట్‌ఫోన్‌కు తప్పనిసరిగా పాస్‌వర్డ్‌ ఉండాలి.
  • మోసం జరిగినట్లు గ్రహిస్తే వెంటనే సదరు బ్యాంకుకు తెలియజేసి.. ఖాతాను స్తంభింపజేయాలి.

ఇదీ చూడండి: రానున్న 3 నెలలు ఉద్యోగ కల్పన అంతంతమాత్రమే!

Last Updated : Sep 30, 2019, 4:49 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details