తాజాగా మీ క్రెడిట్ రిపోర్టును తనిఖీ చేస్తున్నప్పుడు క్రెడిట్ స్కోరు తగ్గినట్లనిపించిందా? తీసుకున్న రుణాలను సమయానికి తీర్చకపోవడం లేదా అప్పులను ఎగ్గొట్టడం దీనికి కారణం కావచ్చు. ఇవి కాకుండా ఏవైనా తప్పులు లేదా ఎప్పుడో తీసుకున్న రుణానికి సంబంధించిన బకాయిల విషయం మీకు జ్ఞప్తికి రాకపోవడం వలన ఏమైనా స్కోరు తగ్గితే పరిస్థితేంటి? దానిని ఎలా సరిదిద్దుకోవాలో కింద తెలుసుకుందాం.
అసలు క్రెడిట్ స్కోరు అంటే ఏంటి?
తీసుకున్న రుణాన్ని మీరు ఎప్పటిలోగా చెల్లిస్తారనే సామర్థ్యాన్ని పరిగణనలోనికి తీసుకుని క్రెడిట్ స్కోరును ఇస్తారు. ఉదాహరణకు మీకు కార్, వ్యక్తిగత రుణం లేదా క్రెడిట్ కార్డుపై రుణం తీసుకుని సమయానికి చెల్లింపులు జరిపితే మీ క్రెడిట్ స్కోరు బాగుంటుంది. ఒకవేళ మీరు సమయానికి డబ్బులు కట్టకపోయినా లేదా ఎగ్గొట్టినా మీ స్కోరు తగ్గిపోయే అవకాశం ఉంది. ప్రస్తుతం దేశంలో నాలుగు క్రెడిట్ బ్యూరోలు, ఈ క్రెడిట్ రిపోర్టులు, స్కోరులను అందిస్తున్నాయి. ఇదొక మూడంకెల సంఖ్య, స్కోరు 750 పైన ఉంటే, మంచిది. అంతకంటే తక్కువ ఉంటే కష్టమే. క్రెడిట్ స్కోరు బాగుంటే మీరు సులభంగా రుణాలను పొందవచ్చు. అలాగే తక్కువ వడ్డీకే రుణాలను పొందే వీలు కూడా ఉంది.
వివాదాన్ని ఎలా పరిష్కరించుకోవాలి?
తీసుకున్న రుణాన్ని సమయానికి కట్టకపోతే, మీ స్కోరు తగ్గిపోతుంది. అదే ఏవైనా తప్పుల కారణంగా స్కోరు తగ్గితే దానిని సరి దిద్దుకునే హక్కు మీకుంది. దీనికోసం మొదట మీ క్రెడిట్ స్కోరు ఎంతుందో తెలుసుకోండి. ప్రస్తుతం చాలా సంస్థలు ఉచితంగానే క్రెడిట్ కార్డులనిస్తున్నాయి. ఆ స్కోరులో మీరు కార్డు వాడకుండానే ఏవైనా బకాయిలు ఉన్నట్లు తేలితే, దానిని సరిదిద్దుకోవచ్చు.
ఈ సమస్యను రెండు రకాలుగా పరిష్కరించుకోవచ్చు. తిరిగి చెల్లించడం లేదా వివాదాన్ని రేపటం. సహేతుకమైన పొరపాట్లుంటే, తిరిగి చెల్లించటం ఉత్తమం. ఒక వేళ ఈ సంఘటన 2004-06 నాటి వివాదం అనుకుంటే, సంబంధిత బ్యాంకులు మీ క్రెడిట్ కార్డు పోర్ట్‌ఫోలియోను, ఆస్తుల పునర్నిర్మాణ కంపెనీల(ఏఆర్‌సీల) అమ్మేసి ఉంటుంది. ఏఆర్‌సీలకు సొమ్ము చెల్లించి ఈ వివాదాన్ని త్వరగా పరిష్కరించుకోవచ్చు. అలా కాకుండా ఈ వివాదానికి సంబంధించి క్రెడిట్ బ్యూరోలో వ్యాజ్యం దాఖలు చేయవచ్చు.
ఎలా రద్దు చేసుకోవచ్చు ?
మీరు బ్యాంకుకు విజ్ఞప్తి చేసుకుంటే సాధారణంగా ఈ ఛార్జీలు రద్దవుతాయి. సులభమైన విధానం ఏంటంటే మీ పోర్ట్‌ఫోలియోను ఏఆర్‌సీలకే ఏ బ్యాంకైతే విక్రయించిందో, దాని మాతృ బ్యాంకుకు విజ్ఞప్తి చేసుకుంటే ఈ ఛార్జీలు రద్దవుతాయి. ఈ ఛార్జీలు రూ.3-5 వేలు అయితే బ్యాంకులు, ఏఆర్‌సీలతో మాట్లాడి రద్దు చేస్తాయి. అలా కానీ పక్షంలో వినియోగదారులే ఈ ఖర్చులను భరించాల్సి ఉంటుంది. ఫీజులు అనేవి మన బాధ్యత, కట్టకుండా మనం తప్పించుకోలేమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
అయితే మోసపూరిత వాగ్ధనాలతో, ఉద్ధేశపూర్వకంగా కార్డులను అంటగట్టి, మీ ప్రమేయం లేకుండా స్కోరు తగ్గితే, మీరు ఎలాంటి డబ్బు కట్టాల్సిన అవసరం లేదు. ఉద్ధేశపూర్వకంగా కార్డుని అంటగట్టినట్లయితే, దానిని వినియోగదారులు రుజువు చేయాల్సి ఉంటుంది. చాలా మంది వినియోగదారులు కార్డు తీసుకునే సందర్భంలో అవసరమైన పత్రాలను విపులంగా చదవకుండానే, సంతకం చేస్తుంటారు. ఒక వినియోగదారుడిగా, మీరు సంతకం చేసిన పత్రాలను అడిగి తీసుకోండి. ఒక వేళ బ్యాంకులు ఈ పత్రాలను ఇవ్వడానికి నిరాకరిస్తే, మీరు బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్‌ను సంప్రదించవచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
కార్డు వాడనప్పటికీ, మీ పై ఛార్జీలను విధిస్తే, మీరు ఎలాంటి సొమ్ము కట్టనక్కర్లేదు. సహేతుక కారణాలనున్న వివాదాలు సులభంగా పరిష్కరమవుతాయి.
ఇదీ చూడండి:క్రియాశీల నగరాల్లో ప్రపంచంలోనే హైదరాబాద్‌కు తొలిస్థానం