స్టాక్ మార్కెట్లలో నిపుణుల గురించి చర్చ వచ్చిందంటే అందులో వారెన్ బఫెట్ ప్రస్తావన కచ్చితంగా ఉంటుంది. ఈ విషయంలో ఎటువంటి సందేహం లేదు. స్టాక్ మార్కెట్‌లోకి కొత్తగా అడుగులు వేసే మదుపర్లకు ఆయన ఒక మార్గదర్శి. ఆయన చెప్పిన మదుపు సూత్రాల్ని పాటించాలని ఎంతో మంది ప్రయత్నిస్తుంటారు. మార్కెట్ గురించి బఫెట్ నాలుగు మంచి విషయాలు చెబితే వినాలని ఉవ్విళ్లూరుతుంటారు. వాటిని పాటించిన వారికి కచ్చితంగా లాభాలు వస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. మంచి కంపెనీలను ఎంపిక చేసుకొని, దీర్ఘకాలం ఆ సంస్థల షేర్లను అట్టేపెట్టుకోమని ఆయన ఇచ్చే ప్రధాన సలహా. దానికి ఇక తిరుగు ఏముంటుంది?
చైనాలో పుట్టిన కరోనా (కొవిడ్-19) వైరస్ తాజాగా ఇటలీ, దక్షిణ కొరియా, ఇరాన్‌లకూ వ్యాపించిన సంగతి తెలిసిందే. ఆయా దేశాల్లో బాధితులు, మృతుల సంఖ్య పెరగడం కారణంగా సరఫరా వ్యవస్థలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని, అంతర్జాతీయ వృద్ధిపై ఆ ప్రభావం పడే అవకాశం ఉందన్న నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లు గత సోమవారం వణికిపోయాయి. ఈ ప్రభావం ఇంకొన్నాళ్లు ఇలాగే కొనసాగొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ తరుణంలో కరోనా ప్రభావం సహా పలు అంశాలపై వారెన్ బఫెట్ తన అభిప్రాయాలు పంచుకున్నారు. అవేంటో ఆయన మాటల్లోనే..
10-20 ఏళ్ల లక్ష్యం ఉండాలి
కరోనా వైరస్ వ్యాప్తి అనేది ప్రస్తుతానికి మార్కెట్లను భయపెట్టే అంశమే. అయితే దాని వల్ల నా స్టాక్స్ ప్రభావం అవుతాయని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే నేను ఎప్పుడూ దీర్ఘకాలాన్ని దృష్టిలో ఉంచుకొని మదుపు చేస్తాను. మదుపర్లు కనీసం 10-20 ఏళ్ల కాల పరిమితితో కంపెనీలను ఎంచుకుని పెట్టుబడులు కొనసాగించాల్సి ఉంటుంది. అప్పుడే ఎలాంటి ప్రతికూల వార్తలు వచ్చినా మార్కెట్లలో లాభాలు మూటగట్టుకోవచ్చు.
ఐఫోన్ కొనుక్కున్నా..
స్మార్ట్‌ఫోన్లకు నేనెప్పుడూ దూరంగా ఉండటానికే ఇష్టపడతాను. అలాంటిది నా శామ్‌సంగ్ ఫ్లిప్ ఫోన్‌ను ఇటీవలే మార్చేశాను. ఐఫోన్ కొనుక్కున్నాను. మే నెలలో నిర్వహించబోయే బెర్క్‌షైర్ హాథవే వార్షిక సమావేశంలో నా పాత ఫోన్‌ను క్రష్ చేసేస్తా.