ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాను సంస్థ ఉద్యోగులే కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం 209 మంది ఉద్యోగులు బృందంగా ఏర్పడి.. ఓ ఫినాన్షియర్ భాగస్వామ్యంతో ఎయిర్ ఇండియాకు కొనుగోలు ఆసక్తి వ్యక్తీకరణ(ఈఓఐ) బిడ్ దాఖలు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ బిడ్ ప్రక్రియను ఎయిర్ ఇండియా వాణిజ్య కార్యకలాపాల డైరెక్టర్ మీనాక్షీ మాలిక్ నిర్వహిస్తున్నారు.
14న ముగియనున్న గడువు..
'ఉద్యోగులు ఎయిర్ ఇండియా నిర్వహణను తీసుకునేందుకు ప్రిలిమ్నరీ ఇన్ఫర్మేషన్ మెమొరాండమ్ (పీఐఎం) వీలుకల్పించింది. ఇది పూర్తయ్యేందుకు కచ్చితంగా పూర్తిచేయాల్సిన నిబంధనలను సూచించింది. మనమంతా వాటిని కలిసికట్టుగా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది.' అని మీనాక్షీ మాలిక్ తోటి ఉద్యోగులకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఎయిర్ ఇండియా కొనుగోలుకు ఈఓఐ దాఖలు చేసేందుకు ఈ నెల 14న గడువు ముగియనున్న నేపథ్యంలో ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది గ్రూప్.