తెలంగాణ

telangana

ETV Bharat / business

గ్రాట్యుటీ అర్హత​ ఐదేళ్ల నుంచి ఏడాదికి కుదింపు? - బిజినెస్ వార్తలు తెలుగు

గ్రాట్యుటీ విషయంలో భారీ మార్పులు చేసేదిశగా కేంద్రం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కనీసం 5 సంవత్సరాలు పనిచేసిన ఉద్యోగులకు మాత్రమే గ్రాట్యూటీ చెల్లించాలన్న నిబంధననను.. ఏడాదికి కుదించే దిశగా ప్రయత్నిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు అంటున్నాయి. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశమున్నట్లు సమాచారం.

గ్రాట్యుటీ నిబంధనల్లో భారీ మార్పులు

By

Published : Oct 31, 2019, 7:55 PM IST

గ్రాట్యుటీ.. ఒక సంస్థలో నమ్మకంగా పనిచేస్తూ 5 లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు సేవలందించినందుకు గానూ తమ ఉద్యోగికి సంస్థ డబ్బు రూపంలో ఇచ్చే బహుమతి. అయితే త్వరలో ఈ గ్రాట్యుటీ చెల్లింపు నిబంధనల్లో మార్పులు జరగనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటిదాకా గ్రాట్యుటీ ఇవ్వాలంటే సదరు ఉద్యోగికి ఆ సంస్థలో కనీసం ఐదేళ్ల సర్వీసు ఉండాలి. అయితే ఈ సర్వీసు నిబంధనను త్వరలో ఏడాదికి కుదించాలని మోదీ సర్కార్‌ భావిస్తోందట.

వచ్చే పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో ఈ మేరకు సోషల్‌ సెక్యూరిటీ బిల్లును తీసుకురానున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ బిల్లుపై డ్రాఫ్ట్‌ కోడ్‌ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. గ్రాట్యుటీ సర్వీసు అర్హతను ఏడాదికి తగ్గించాలని గత కొంతకాలంగా కార్మిక యూనియన్ల నుంచి డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో కేంద్రం దీన్ని పరిగణనలోకి తీసుకున్నట్లు సదరు వర్గాల సమాచారం. అయితే దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం రాలేదు.

గ్రాట్యుటీ చెల్లింపులు ఇలా..

ఒక సంస్థలో 5 సంవత్సరాల సర్వీస్‌ పూర్తిచేసిన తర్వాత.. 26 రోజులను పనిదినాలుగా పరిగణనలోకి తీసుకుని సంవత్సరానికి 15 రోజుల చొప్పున గ్రాట్యుటీ లెక్కిస్తారు. ఉద్యోగం చేసిన సంవత్సరాల ఆధారంగా గ్రాట్యుటీ వస్తుంది. ఉద్యోగ సర్వీస్‌ 6 నెలల కంటే ఎక్కువ ఉన్నా.. అది ఒక సంవత్సరంగానే పరిగణిస్తారు. ఉదాహరణకు ఒక ఉద్యోగి సర్వీస్‌ 5 సంవత్సరాల 7 నెలలు ఉంటే అప్పుడు 6 సంవత్సరాలకు గ్రాట్యుటీ ఇస్తారు. కంపెనీకి 6 పనిదినాలు ఉన్నట్లయితే, ఉద్యోగి సంవత్సరానికి కనీసం 240 రోజులు పనిచేయాల్సి ఉంటుంది. ఒకవేళ కంపెనీకి 5 రోజులు మాత్రమే ఉన్నట్లయితే 190 రోజులు పనిచేయాలి.

ఉద్యోగి ఒక సంస్థలో 5 సంవత్సరాల సర్వీసు పూర్తిచేసి తర్వాత పదవీ విరమణ చేసినా.. లేదా రాజీనామా చేసినా గ్రాట్యుటీ చెల్లిస్తారు. ఒకవేళ ఉద్యోగి పనిచేస్తున్నప్పుడు ప్రమాదవశాత్తూ చనిపోయినా, శాశ్వత వైకల్యానికి గురైనా గ్రాట్యుటీ వస్తుంది.

ఇదీ చూడండి: వాట్సాప్​ డేటాను చోరీ చేసిన ఇజ్రాయెల్​ స్పైవేర్​!

ABOUT THE AUTHOR

...view details