ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్లో భాగంగా సరికొత్త ప్రభుత్వ రంగ సంస్థల విధానాన్ని రూపొందిస్తున్నట్లు ప్రకటించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్. ఈ విధానంలో భాగంగా వ్యూహాత్మక రంగాల్లో నాలుగుకు మించి ప్రభుత్వ రంగ సంస్థలు ఉండవని తెలిపారు.
ఆర్థిక ప్యాకేజీ చివరి రౌండ్ ప్రకటనల్లో భాగంగా ఈ మేరకు వెల్లడించారు ఆర్థిక మంత్రి.
" ప్రజాప్రయోజనాల దృష్ట్యా పీఎస్యూల అవసరం ఎక్కడ ఉందో గుర్తిస్తాం. వ్యూహాత్మక రంగాల్లో కనీసం ఒక పీఎస్యూ ఉంటుంది. కానీ ప్రైవేటు పెట్టుబడులకూ అనుతిస్తాం. వ్యూహాత్మక రంగాలు మినహా మిగతా రంగాల్లోని ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరిస్తాం. అనవసరపు పరిపాలనాపరమైన ఖర్చులను తగ్గించేందుకు వ్యూహాత్మక రంగాల్లో కేవలం 1-4 పీఎస్యూలు ఉంటాయి. ఇతర సంస్థల విషయంలో ప్రైవేటీకరణ లేదా హేతుబద్దీకరణ, విలీనం వంటి చర్యలు ఉండొచ్చు."
– ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్