దేశీయ ఉత్పత్తులకు ఊతమిచ్చేలా.. తక్కువ నాణ్యత కలిగిన వస్తువుల దిగుమతుల నియంత్రణ.. ముఖ్యంగా చైనా ఉత్పత్తులను తగ్గించాలని కేంద్రం భావిస్తోంది. దేశీయ ధరలు, పన్ను ప్రతికూలతలను పరిగణనలోకి తీసుకొని వస్తువులవారీగా చౌక వస్తువుల దిగుమతుల వివరాలు సమర్పించాలని పరిశ్రమవర్గాలను కోరినట్లు తెలుస్తోంది. చైనా నుంచి దిగుమతులు తగ్గించటం సహా భారత్ స్వావలంబనను ప్రమోట్‌చేసే అంశంపై ఇటీవల ప్రధానమంత్రి కార్యాలయంలో జరిగిన సమావేశంలో చర్చ జరిగినట్లు సమాచారం. చైనా నుంచి దిగుమతయ్యే వస్తువులు, ముడిసరుకులు ప్రధానంగా చేతి గడియారాలు, గోడ గడియారాలు, గాజు బుడ్డీలు, గాజు, రాడ్లు, ట్యూబ్‌లు, హెయిర్‌క్రీమ్స్, షాంపులు, పౌడర్లు, సౌందర్య ఉత్పత్తులు, ప్రింటింగ్‌ఇంక్, పెయింట్స్, వార్నిషెస్, పొగాకు ఉత్పత్తులకు సంబంధించి పరిశ్రమవర్గాల అభిప్రాయాలతోపాటు సలహాలు కోరినట్లు తెలుస్తోంది.
2014-15, 2018-19 మధ్య చైనా దిగుమతుల్లో పెరుగుదల, దేశీయంగా తయారైన అలాంటి వస్తువుల ధరల వివరాలు, దేశీయ ఉత్పత్తి సామర్థ్యం, స్వేచ్ఛావర్తక ఒప్పందాల్లో భాగంగా దిగుమతులు, విలోమ పన్నుల అంశాలపై పరిశ్రమవర్గాల నుంచి.. కేంద్ర ప్రభుత్వం సమాచారం కోరింది. ప్రభుత్వం కోరిన అన్నిఅంశాలకు సంబంధించిన వివరాలను సిద్ధంచేసి త్వరలోనే వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖకు పంపనున్నట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. భారత్-చైనా మధ్య ఉద్రిక్తతలు హింసాత్మకంగా మారిన నేపథ్యంలో.. డ్రాగన్‌దేశం నుంచి దిగుమతుల నియంత్రణ, తగ్గింపుపై కేంద్రం దృష్టి సారించటం ప్రాధాన్యం సంతరించుకుంది. భారత్ దిగుమతుల్లో చైనా వాటా 14 శాతంగా ఉంది. చరవాణులు, టెలికం, విద్యుత్తు, ప్లాస్టిక్‌బొమ్మలు, ఫార్మా మిశ్రమ పదార్థాలకు చైనా ప్రధాన సరఫరాకు నిలుస్తోంది.