తెలంగాణ

telangana

By

Published : Nov 15, 2019, 11:31 PM IST

ETV Bharat / business

బ్యాంకు డిపాజిట్లపై బీమా పెంపు దిశగా కేంద్రం అడుగులు..!

పీఎంసీ కుంభకోణం నేపథ్యంలో కేంద్రం త్వరలో ఓ కొత్త చట్టాన్ని తీసుకువచ్చేందుకు సిద్ధమైంది. బ్యాంకు డిపాజిట్లపై ప్రస్తుతమున్న బీమా క్లెయిమ్ పెంపు సహా.. సహకార బ్యాంకుల నిబంధనలు కఠినతరం చేయడం వంటివి ఈ కొత్త చట్టంలో ఉండనున్నాయి.

నిర్మలా సీతారామన్

బ్యాంకు డిపాజిట్లపై ప్రస్తుతం ఉన్న రూ.లక్ష బీమాను పెంచేందుకు కేంద్రం కొత్త చట్టం తీసుకురానున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఎక్కువ రాష్ట్రాల్లో ఉన్న సహకార బ్యాంకుల నియంత్రణ అంశమూ కొత్త చట్టంలో పొందుపరచనున్నట్లు ఆమె వెల్లడించారు.

ఇందుకు సంబంధించిన బిల్లును త్వరలో ప్రారంభం కానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు.

ప్రస్తుతం ఏదైనా బ్యాంకు ఉన్నఫలంగా మూతపడి డిపాజిటర్ల సొమ్ము తిరిగి చెల్లించలేని పరిస్థితుల్లో చిక్కుకుంటే.. వారికి డిపాజిట్​ ఇన్స్యూరెన్స్, క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్​ నుంచి రూ.లక్ష వరకు బీమా లభిస్తుంది.

కొత్త చట్టం ఎందుకంటే..

ఇటీవల బయటపడిన పంజాబ్​-మహారాష్ట్ర సహకార బ్యాంకు (పీఎంసీ) కుంభకోణం నేపథ్యంలో కొత్త చట్టం తీసుకువచ్చేందుకు కేంద్రం సిద్ధమైంది. పీఎంసీ భారీ కుంభకోణంలో చిక్కుకున్న కారణంగా.. అందులో డబ్బు దాచుకున్న వారు తమ సొమ్ము తిరిగిపొందేందుకు ఇబ్బంది పడుతున్నారు. పీఎంసీపై రిజర్వు బ్యాంకు విధించిన ఆంక్షలతో ఈ ఇబ్బందులు అధికమయ్యాయి.

టెలికాం సంస్థల సంక్షోభం..

టెలికాం రంగంలో నెలకొన్న తాజా పరిస్థితుల గురించి నిర్మలా సీతారమన్ స్పందిస్తూ.. "ఏ సంస్థ మూత పడాలని మేము కోరుకోము. అందరూ ఎదగాలనే భావిస్తాం." అని అన్నారు.

దేశంలోని రెండు ప్రధాన టెలికాం సంస్థలు వొడాఫోన్-ఐడియా, ఎయిర్​టెల్​ సంస్థలు రెండు కలిపి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ.74,000 కోట్ల నష్టాన్ని ప్రకటించాయి. సర్దుబాటు చేసిన స్థూల ఆదాయ అపరాధ రుసుములు చెల్లించాల్సిందేనని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ఇందుకు ప్రధాన కారణం.

టెలికాం పరిశ్రమలు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులపై చర్చించేందుకు కార్యదర్శుల కమిటీని నియమించినట్లు సీతారామన్ పేర్కొన్నారు. అయితే ఇప్పటి వరకు వాటిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారామె.

ఇదీ చూడండి: సంఘటిత కార్మికులకు దేశవ్యాప్తంగా ఒకే వేతన దినం!

ABOUT THE AUTHOR

...view details