తెలంగాణ

telangana

By

Published : Aug 5, 2021, 8:02 PM IST

ETV Bharat / business

రెట్రోస్పెక్టివ్​పై కేంద్రం వెనకడుగు- లోక్​సభలో బిల్లు

రెట్రోస్పెక్టివ్ పన్ను వివాదాల నుంచి బయటపడే విధంగా కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ఈ పన్ను వసూలు పద్ధతికి చరమగీతం పాడే బిల్లును లోక్​సభలో ప్రవేశపెట్టింది. వొడాఫోన్, కెయిర్న్ వంటి సంస్థల కేసుల్లో అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కోర్టుల్లో భారత ప్రభుత్వానికి ఎదురుదెబ్బలు తగిలిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

Govt moves to end legal battle with Vodafone, Cairn on retro tax
రెట్రోస్పెక్టివ్ పన్ను వసూలు

రెట్రోస్పెక్టివ్ పన్ను వసూలు విధానంపై భారత ప్రభుత్వం వెనక్కి తగ్గింది. యూపీఏ హయాంలో తీసుకొచ్చిన ఈ చట్టానికి మంగళం పాడనుంది. ఈ మేరకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. పన్ను చట్టాల సవరణ బిల్లును లోక్​సభలో ప్రవేశపెట్టారు.

"1961 ఆదాయ పన్ను చట్టాన్ని ఈ బిల్లు సవరిస్తుంది. 2012 మే 28కి ముందు భారత్​లోని ఆస్తులను పరోక్షంగా బదిలీ చేసుకుంటే.. రెట్రోస్పెక్టివ్ విధానంలో పన్ను వసూలు చేసే నిబంధనను ఈ బిల్లు తొలగిస్తుంది. ఈ తేదీకి ముందు ఆస్తుల పరోక్ష బదిలీలపై చేసిన పన్ను డిమాండ్​లు.. నిబంధనలకు లోబడి రద్దు అవుతాయి. ఇలాంటి కేసుల్లో సంస్థలు చెల్లించిన నగదును వడ్డీ లేకుండా రీఫండ్ చేసే ప్రతిపాదనను సైతం ఈ బిల్లులో పొందుపరిచాం."

-నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక మంత్రి

పాత తేదీల నుంచి పన్ను వసూలు చేసే పద్ధతినే రెట్రోస్పెక్టివ్ ట్యాక్సేషన్ అని పిలుస్తారు. కెయిర్న్ ఎనర్జీ, వొడాఫోన్ గ్రూప్ కంపెనీలతో భారత ప్రభుత్వానికి ఉన్న దీర్ఘకాల పన్ను వివాదాలు దీనికి సంబంధించినవే. అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కోర్టులో ఈ సంస్థలు దాఖలు చేసిన రెండు వేర్వేరు వ్యాజ్యాల్లో భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు వచ్చాయి. వొడాఫోన్ విషయంలో పెద్దగా ప్రభావం లేకపోయినా.. కెయిర్న్ ఎనర్జీ కేసులో మాత్రం 1.2 బిలియన్ డాలర్లు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సొమ్ము చెల్లించకపోవడం వల్ల.. ఫ్రాన్స్​లోని భారత ఆస్తుల జప్తునకూ ఆదేశాలు వెలువడ్డాయి.

విదేశీ కంపెనీలు భారత్​లోని తమ ఆస్తులను పరోక్ష పద్ధతిలో బదిలీ చేసుకున్నప్పటికీ.. పన్ను చెల్లించేలా ఆదాయ పన్ను చట్టానికి మార్పులు చేస్తూ 2012లో యూపీఏ సర్కారు బిల్లును తీసుకొచ్చింది. ఆ ఏడాది మే 28 నుంచి ఇది అమలులోకి వచ్చింది. అయితే, ఆ తేదీకి ముందు జరిగిన లావాదేవీలకు(రెట్రోస్పెక్టివ్) కూడా పన్ను వసూలు చేసేలా బిల్లును రూపొందించారు. దీని ప్రకారం.. కెయిర్న్ ఎనర్జీ సహా వొడాఫోన్ సంస్థలకు కేంద్రం నోటీసులు జారీ చేసింది. వీటిని సవాల్ చేస్తూ.. ఆయా సంస్థలు అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కోర్టును ఆశ్రయించాయి.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details