తెలంగాణ

telangana

By

Published : Nov 17, 2020, 8:51 PM IST

ETV Bharat / business

లక్ష్మీ విలాస్ బ్యాంకుపై 30 రోజుల మారటోరియం

లక్ష్మీ విలాస్​ బ్యాంకుపై కేంద్ర ప్రభుత్వం 30 రోజుల పాటు మారటోరియం విధించింది. బ్యాంకు బోర్డును రద్దు చేసిన ఆర్​బీఐ.. నగదు ఉపసంహరణ పరిమితిని రూ.25 వేలకు తగ్గించింది. బ్యాంకు ఆర్థిక పరిస్థితి క్షీణిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Lakshmi Vilas Bank
లక్ష్మి విలాస్ బ్యాంకు

చెన్నై ఆధారిత లక్ష్మీ విలాస్ బ్యాంకు(ఎల్​వీబీ)పై కేంద్ర ప్రభుత్వం మంగళవారం మారటోరియం విధించింది. ఈ తాత్కాలిక నిషేధం నవంబర్​ 17 నుంచి నెలరోజుల పాటు అమలులో ఉంటుంది. దీనితోపాటు బోర్డును రద్దు చేస్తూ డిపాజిటర్ల నగదు ఉపసంహరణ పరిమితిని రూ.25 వేలకు కుదించింది.

లక్ష్మీ విలాస్​ బ్యాంకు ఆర్థిక పరిస్థితి క్షీణిస్తున్న తరుణంలో రిజర్వ్​ బ్యాంకు సూచనల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆర్​బీఐ ఓ ప్రకటన చేసింది.

"నమ్మదగిన బ్యాంకు పునర్నిర్మాణ ప్రణాళిక లేని కారణంగా.. డిపాజిటర్ల ప్రయోజనాలతోపాటు ఆర్థిక స్థిరత్వం కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇందుకు మరో ప్రత్యామ్నాయం లేదు. బ్యాంకింగ్ నియంత్రణ చట్టం-1949లోని సెక్షన్ 45 ప్రకారం మారటోరియం అమలు చేయాలని కేంద్రానికి సూచించాం."

- ఆర్​బీఐ ప్రకటన

ఆర్​బీఐ అనుమతి లేనిదే..

మారటోరియం సమయంలో, ఆర్​బీఐ నుంచి ఎటువంటి రాతపూర్వక అనుమతి లేకుండా డిపాజిటర్లకు రూ.25,000 కంటే ఎక్కువ విలువైన చెల్లింపులు చేయడానికి బ్యాంకును అనుమతించరు. ఇది సేవింగ్స్, కరెంట్ లేదా ఇతర అన్ని డిపాజిట్ ఖాతాలకు వర్తిస్తుంది.

బోర్డు రద్దు..

ఎల్​వీబీ ప్రస్తుత బోర్డును రద్దు చేసిన ఆర్​బీఐ.. కెనరా బ్యాంకు మాజీ నాన్​-ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్​ టీఎన్​ మనోహరన్​ను పాలనాధిపతిగా నియమించింది.

విలీనం..

ఇప్పటికే ఎల్​వీబీని డీబీఎస్​ బ్యాంకులో విలీనం చేయాలని ఆర్​బీఐ ముసాయిదాను ప్రకటించింది. మారటోరియం గడువు పూర్తి కాగానే ఈ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

ఏజీఎంలో మొదలైన సమస్య..

సెప్టెంబర్​లో జరిగిన ఎల్​వీబీ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో సంస్థలోని నిర్వహణ లోపాలు బయటపడ్డాయి. కరోనా నేపథ్యంలో దృశ్యమాధ్యమంలో జరిగిన ఈ సమావేశంలో బ్యాంకు ఎండీ, సీఈఓ సుందర్​ సహా ఆరుగురు డైరెక్టర్ల పునర్​ నియామకానికి వ్యతిరేకంగా వాటాదారులు ఓటు వేశారు.

ఈ పరిణామంతో 90 ఏళ్ల చరిత్ర కలిగిన బ్యాంకు విషయంలో బ్యాంకింగ్​, ఫినాన్షియల్ రంగంలో ఆందోళనలు మొదలయ్యాయి. ఈ సంస్థను ఏదైనా ప్రభుత్వ రంగ బ్యాంకులో విలీనం చేయాలని డిమాండ్లు వినిపించాయి.

ఇదీ చూడండి:లక్ష్మీ విలాస్ బ్యాంకు వివాదమేంటి?

ABOUT THE AUTHOR

...view details