కేంద్రం ఇటీవల తప్పనిసరి చేసిన నూతన ఐటీ నిబంధనలను(New IT rules) అమలు చేయడం ప్రారంభించాయి ప్రముఖ టెక్ దిగ్గజాలు గూగుల్, ఫేస్బుక్. ఇందుకోసం కొత్త గ్రీవెన్స్ ఆఫీసర్ నియామకం ప్రతిబింబించేలా.. తమ వెబ్సైట్లను అప్డేట్ చేస్తున్నాయి. గూగుల్, యూట్యూబ్‌లో ఇప్పటికే నూతన అధికారుల వివరాలను పొందుపరచడం గమనార్హం.
గూగుల్, ఫేస్బుక్, వాట్సాప్ వంటి సంస్థలు ఇప్పటికే కొత్త నిబంధనల అమలుకు సంబంధించి వివరాలను ఐటీ మంత్రిత్వ శాఖతో పంచుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ట్విట్టర్(Twitter) మాత్రం ఇంకా కొత్త రూల్స్‌ను పాటించడం లేదని తెలిసింది.
ఏమిటి ఈ కొత్త రూల్స్..
సామాజిక మాధ్యమాలు సహా ఇతర డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ కొత్తగా చీఫ్ కంపైలెన్స్ ఆఫీసర్, నోడల్, రెసిడెంట్ గ్రీవెన్స్ అధికారులను నియమించాలి. ఈ ముగ్గురు అధికారులు భారత్ నుంచే కార్యకలాపాలు జరపాలి. అభ్యంతరకర పోస్టులపైన వారు తీసుకున్న చర్యల గురించి ప్రతి నెలా కేంద్రానికి నివేదిక అందించాలి.
ఈ మార్గదర్శకాలను ఫిబ్రవరిలోనే విడుదల చేసింది కేంద్రం. 50లక్షలు లేదా అంతకన్నా ఎక్కువ వినియోగదారులు ఉన్న సామాజిక మాధ్యమాలకు ఈ నిబంధనలు వర్తిస్తాయని తెలిపింది. ఈ నిబంధనలను అమలు చేసేందుకు మే 25ను తుది గడువుగా ఉంచింది.
పోస్టులపై ప్రభుత్వం లేదా కోర్టులు అభ్యంతరం వ్యక్తం చేస్తే సంబంధిత పోస్టులను 36 గంటల్లోగా తొలగించాలి. పోస్టులు అసభ్యకరంగా ఉన్నాయంటూ ఫిర్యాదు అందితే సంస్థలు వాటిని 24 గంటల్లోగా తొలగించాలి. తప్పుడు సమాచారాన్ని మొదట ప్రారంభించిన వారి వివరాలను కోర్టు లేదా ప్రభుత్వాలు కోరితే.. వాటిని అందించాలి.
ఇదీ చదవండి:1జీ నుంచి 5జీ వరకు- ప్రయాణం తెలుసా?