ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియోలోకి పెట్టుబడుల వరద కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఫేస్బుక్ సహా 12 సంస్థలు 13 దఫాల్లో జియోలో పెట్టుబడులు పెట్టాయి. 25 శాతానికిపైగా వాటాను ఆయా సంస్థలకు విక్రయించడం ద్వారా మొత్తం రూ.1,18,318.45 కోట్లు గడించింది జియో.
ఇప్పుడు మరో దిగ్గజ సంస్థ గూగుల్.. జియో ప్లాట్‌ఫామ్స్‌లో 4 బిలియన్ డాలర్లు (రూ.30 వేల కోట్లకు పైమాటే) పెట్టుబడి పెట్టనున్నట్లు వార్తలొస్తున్నాయి. దీనికి సంబంధించి గూగుల్-జియో మధ్య చర్చలు చివరి దశకు చేరినట్లు ఈ వ్యవహారంతో సంబంధమున్న వ్యక్తులు తెలిపారు.
ఈ విషయంపై ఇరు సంస్థలు రానున్న వారాల్లో అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశముందని వారు వెల్లడించారు. అయితే దీనిపై గూగుల్, జియో స్పందించేందుకు నిరాకరించాయి.