తెలంగాణ

telangana

ETV Bharat / business

బ్యాంకింగ్​లోకి గూగుల్​... త్వరలో చెకింగ్​ ఖాతా సేవలు! - గూగుల్ క్యాచీ

గూగుల్​ పే... టెక్​ దిగ్గజం గూగుల్​ తీసుకొచ్చిన డిజిటల్ వాలెట్. అనేక దేశాల్లో మంచి ఆదరణ పొందుతోంది. ఇదే ఉత్సాహంతో ఆర్థిక సేవల రంగంలో మరో ముందడుగు వేసేందుకు సిద్ధమైంది గూగుల్. నగదు జమ, ఉపసంహరణకు వీలు కల్పించే చెకింగ్​ ఖాతా సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది.

బ్యాంకింగ్​లోకి గూగుల్​... త్వరలో చెకింగ్​ ఖాతా సేవలు!

By

Published : Nov 14, 2019, 3:02 PM IST

Updated : Nov 14, 2019, 3:17 PM IST

సిటీ గ్రూప్​ సంస్థతో కలిసి కొత్త 'చెకింగ్ అకౌంట్' సేవలను దిగ్గజ సంస్థ గూగుల్​ ప్రారంభించనున్నట్లు ప్రముఖ వార్తా సంస్థ వాల్​స్ట్రీట్ జర్నల్ తెలిపింది. ఆర్థిక సంస్థల చెకింగ్​ అకౌంట్లకు భద్రతా, నియంత్రణ వంటి వాటిపై గూగుల్ అధ్యయనం చేస్తోందని కథనం ప్రచురించింది. క్యాష్ అనే పేరుతో గూగుల్ ఈ ప్రాజెక్టు నిర్వహిస్తోందని తెలిపింది.

ఆర్థిక వ్యవస్థలతో పూర్తి స్థాయి భాగస్వామిగా మారేందుకు సంస్థ మొగ్గుచూపుతోందన్న గూగుల్ అత్యున్నత అధికారి వ్యాఖ్యలను జర్నల్ ఉటంకించింది. ఈ ప్రక్రియ సుదీర్ఘమైనదైనా... సురక్షితమైన దారి కాబట్టి సంస్థ ఈ విషయంలో ముందుకెళ్తున్నట్లు పత్రిక తెలిపింది.

ఏంటీ చెకింగ్ అకౌంట్?

చెకింగ్ అకౌంట్​ అంటే సాధారణ బ్యాంక్ అకౌంట్ వంటిదే. బ్యాంకులు అందించే డిపాజిట్లు, విత్​డ్రాసేవలను ఇది అందిస్తుంది. అయితే బ్యాంకులతో పోలిస్తే అపరిమిత డిపాజిట్లు, అపరిమిత విత్​డ్రాలు చేసుకునే వీలుంటుంది. ఎలక్ట్రానిక్ పద్ధతితో పాటు, చెక్కులు, ఏటీఎంలతో నగదును బదిలీ చేసుకోవచ్చు.

ఈ-కామర్స్ రంగంపై దిగ్గజాల ఆసక్తి

ఆర్థిక కార్యకలాపాలు సహా ఈ-కామర్స్ రంగంపై అంతర్జాల దిగ్గజ సంస్థలు చాలా ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. ఫోన్​ ద్వారా త్వరితగతిన చెల్లింపులు చేసుకునేందుకు వీలుగా యాపిల్, గూగుల్ సంస్థలు ఇప్పటికే తమ వాలెట్ సర్వీసులను ప్రారంభించాయి. యాపిల్ సొంత క్రెడిట్​ కార్డును కూడా విడుదల చేసింది.

అమెజాన్ సంస్థ సైతం చెకింగ్ ఖాతా సేవలను ప్రారంభించనున్నట్లు సమాచారం. సామాజిక మాధ్యమ దిగ్గజమైన ఫేస్​బుక్ కూడా క్రమక్రమంగా ఈ-కామర్స్ రంగంలోకి ప్రవేశిస్తోంది. నగదు బదిలీ చేసుకోవడానికి వీలుగా సంస్థకు చెందిన వాట్సాప్​లో కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది. వివాదాస్పద క్రిప్టోకరెన్సీ లిబ్రాను సైతం ఆవిష్కరించే ప్రయత్నాలు చేస్తోంది. వచ్చే ఏడాది లిబ్రా విడుదలకు ఫేస్​బుక్ ప్రయత్నిస్తున్నప్పటికీ... నగదు నియంత్రణ సంస్థలు, ప్రభుత్వాల నుంచి తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటోంది.

Last Updated : Nov 14, 2019, 3:17 PM IST

ABOUT THE AUTHOR

...view details