కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తూ ప్రపంచ దేశాల్లో అన్ని రంగాలపై ప్రభావం చూపుతూ.. ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ విమానయాన రంగంపై ఈ మహమ్మారి ప్రభావం అధికంగా ఉండనుందని ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్(ఐఏటీఏ) వెల్లడించింది. 2020 ఆర్థిక ఏడాదిలో దాదాపు 252 బిలియన్ డాలర్ల మేర ప్రయాణికుల ద్వారా వచ్చే ఆదాయాన్ని కోల్పోయే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. ఇది 2019 ఆదాయంతో పోలిస్తే 44 శాతం తక్కువ.
"113 బిలియన్ల డాలర్ల మేర ఆదాయం కోల్పోయే అవకాశం ఉందని మార్చి 5న అంచనా వేశాం. ఇది కొవిడ్-19 విస్తృతి ఎక్కువ ఉన్న సమయంలోని లెక్కలే. కానీ ప్రస్తుతం ఉన్న ప్రయాణ ఆంక్షలు అప్పుడు లేవు. ఇదే పరిస్థితి మరో మూడు నెలలు కొనసాగితే 38 శాతం డిమాండ్ తగ్గిపోయి.. 252 బిలియన్ డాలర్ల ఆదాయం నష్టపోవాల్సి వస్తుంది."
-అలెగ్జాండర్ డి జునియాక్, డైరెక్టర్ జనరల్, ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్