తెలంగాణ

telangana

ETV Bharat / business

పాస్​వర్డ్​ ఇలా ఉంటే హ్యాక్​ అసాధ్యమే! - ఈటీవీ భారత్

ఇటీవల సైబర్ నేరాలు ఎక్కువయ్యాయి.  ఎంతో మంది సైబర్​ నేరగాళ్ల వలలో చిక్కుకుని ఆర్థికంగా నష్టపోవడం సహా.. విలువైన సమాచారాన్ని కోల్పోతున్నారు. మోసాల బారిన పడిన వ్యక్తుల్లో చాలా వరకు వారు చేసిన చిన్న చిన్న పొరపాట్లే కారణం. ఇందులో ఎక్కువ శాతం పాస్​వర్డ్​లకు సంబంధించినవేనని సైబర్​ నిపుణులు అంటున్నారు. మరి పాస్​వర్డ్​లు హ్యాకర్ల చేతికి చిక్కకుండా ఉండాలంటే ఏం చేయాలి.. ఎలాంటి పాస్​వర్డ్​లు సురక్షితమో తెలుసుకోండి.

సురక్షిత పాస్​వర్డ్

By

Published : Sep 16, 2019, 6:01 AM IST

Updated : Sep 30, 2019, 6:53 PM IST

దినదినాభివృద్ధి చెందుతున్న ఇంటర్నెట్​ ప్రపంచంలో అన్ని అవసరాలు అన్​లైన్​లోనే తీరిపోతున్నాయి. అయితే ఆన్​లైన్​లో అంతా సురక్షితం కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా ఆర్థిక సమాచారం ఉండే నెట్​ బ్యాంకింగ్ ​యాప్​లు, వ్యక్తిగత సమాచారముండే వెబ్​సైట్లపై.. యూజర్లంతా అధిక జాగ్రత్త వహించాలి. సైబర్ నేరగాళ్లకు చిక్కకుండా ఆయా ఆన్​లైన్ సంస్థలు కఠినమైన రక్షణ వ్యవస్థను పాటిస్తున్నా.. యూజర్లు చేసే చిన్న చిన్న పొరపాట్లతో వారి ఖాతాలు హ్యాక్​ చేయడానికి వీలు దొరుకుతోంది. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పాస్​వర్డ్​లు. హ్యాకర్లు మీ పాస్​వర్డ్​లను ఎలా కనుగొంటున్నారు? వారికి దొరకుండా సురక్షితమైన పాస్​వర్డ్​లు ఎలా పెట్టుకోవాలో తెలుసుకోండి.

వీలైనంత పెద్ద పాస్​వర్డ్​..

హ్యాకర్లు మీ అకౌంట్‌ను హ్యాక్‌ చేయడానికి అనేక పద్ధతులు పాటిస్తారు. మొదట మీ పేరు, తదితర ప్రాథమిక అంశాలను పరిశీలించి.. ఊహించి పాస్‌వర్డ్‌లను టైప్‌ చేసి ప్రయత్నిస్తారు. ‘బ్రూట్‌ ఫోర్స్‌ అటాక్‌’ అనేది మరో పద్దతి. ఇది ఒక కంప్యూటర్‌ ప్రోగ్రామ్‌. దీని ద్వారా పదాలు, సంఖ్యలు, సింబల్స్‌ను కలిపి వీలైనన్నీ పాస్‌వర్డ్‌లను రూపొందించి మీ అకౌంట్‌కు ఉన్న పాస్‌వర్డ్‌ను కనిపెట్టే అవకాశముంది. అలా జరగకూడదంటే.. మీరు మీ పాస్‌వర్డ్‌ను వీలైనన్ని ఎక్కువ అక్షరాలు, సంఖ్యలు, సింబల్స్‌తో పెద్ద పాస్‌వర్డ్‌ను పెట్టుకోవడం మంచిది.

మార్చిన ప్రతిసారి కొత్త పాస్​వర్డ్​...

హ్యాకర్లు ఇప్పటికే ఎన్నో మెయిళ్లు, పాస్‌వర్డ్‌లను దొంగిలించి ఉంటారు. కాబట్టి మీరు గతంలో పెట్టుకున్న పాస్‌వర్డ్‌ను మళ్లీ కొత్త వాటికి పెట్టకండి. దీని ద్వారా హ్యాకర్లు సులభంగా మీ అకౌంట్‌ను హ్యాక్‌ చేసి దుర్వినియోగపరిచే అవకాశముంది. ఆన్‌లైన్‌లో పాస్‌వర్డ్‌ మేనేజర్లు చాలా ఉన్నాయి. ఉచితంగా లభించేవి చాలా తక్కువ. కాస్త ఖర్చయినా పెయిడ్‌ పాస్‌వర్డ్‌ మేనేజర్లలో మీ పాస్‌వర్డ్‌లు భద్రంగా ఉంటాయి. ఇవి మీరు పెట్టుకున్న పాస్‌వర్డ్‌ ఎన్‌క్రిప్ట్‌ చేసి భద్రపరుస్తాయి. మీ విలువైన సమాచారాన్ని భద్రపర్చుకోవాలంటే అవసరం ఉన్నా లేకున్నా అప్పుడప్పుడు పాస్‌వర్డ్‌ను మారుస్తూ ఉండండి. ఎక్కడ లాగిన్‌ అయినా పని పూర్తవగానే లాగవుట్‌ కావడం మర్చిపొవద్దు.

పాస్​వర్డ్​కు ప్రైవసీ ఇవ్వాలి..

చుట్టూ ఎవరైనా ఉన్నారా లేదా అన్నది చూడకుండానేచాలా మందిపాస్‌వర్డ్‌ను టైప్‌ చేస్తుంటారు. ఇది అంత మంచిదికాదు. మీరు వీలైనంత గోప్యంగా పాస్‌వర్డ్‌ను వినియోగంచండి. పాస్​వర్డ్​లు ఎవరికీ చెప్పొద్దు. అందరికీ తెలిసేలా రాసిపెట్టడం.. పాస్‌వర్డ్‌ను సూచించేలా వస్తువులు పెట్టడం లాంటివి చేయకూడదు. అలాగే పబ్లిక్‌ వైఫై వినియోగిస్తున్నప్పుడు ఏ వెబ్‌సైట్లు, యాప్స్‌లో లాగిన్‌ అవకుండా ఉండటమే ఉత్తమం. ఎందుకంటే పబ్లిక్‌ వైఫై లక్ష్యంగా హ్యాకర్లు దాడి చేస్తుంటారు. ఎవరైనా ఈ వైఫైను ఉపయోగిస్తూ పాస్‌వర్డ్‌ ఎంటర్‌ చేస్తే అది హ్యాకర్లకు తెలిసిపోతుంది.

వైవిధ్యంగా ఉంటే బెటర్​..

చాలా మంది తమ పేర్లు, పుట్టిన రోజు, లేదా 12345/98765 అంటూ సాధారణ పాస్‌వర్డ్‌లు పెడుతుంటారు. దీని వల్ల హ్యాకర్లు చాలా సులభంగా పాస్‌వర్డ్‌ను కనిపెట్టేస్తారు. అందుకే ఎవరూ ఊహించకుండా అర్థం లేని, క్రమం లేని పదాలను, సంఖ్యలను పాస్‌వర్డ్‌గా పెట్టుకోండి.. దాన్ని మీరు మాత్రమే గుర్తుంచుకుంటే చాలు.. ఇంకెవరు ఆ పాస్‌వర్డ్‌ను కనిపెట్టలేరు. కేవలం పదాలతోనో, సంఖ్యలతోనో పాస్‌వర్డ్‌ పెట్టుకోవడమూ ప్రమాదమే.. చాలా తొందరగా పాస్‌వర్డ్‌ క్రాక్‌ అయ్యే అవకాశముంటుంది. అదే పదాలు, సంఖ్యలు, సింబల్స్‌, ఒక అక్షరం లోయర్‌కీ (స్మాల్‌ లెటర్‌), ఒక అక్షరం అప్పర్‌ కేస్‌ (క్యాపిటల్‌ లెటర్‌) ఇలా వైవిధ్యంగా ఉంటే పాస్‌వర్డ్‌ భద్రంగా ఉన్నట్టే.

ఇదీ చూడండి: ఈ-వాలెట్స్​తో జర భద్రం గురూ!

Last Updated : Sep 30, 2019, 6:53 PM IST

ABOUT THE AUTHOR

...view details