తెలంగాణ

telangana

ETV Bharat / business

భారత్​లో కార్ల ఉత్పత్తికి ఫోర్డ్​ గుడ్​బై!

భారత్​లో కార్ల తయారీ ప్లాంట్లను మూసేసే యోచనలో ఫోర్డ్ ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కంపెనీ పునర్​వ్యవస్థీకరణలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

Ford
ఫోర్డ్​

By

Published : Sep 9, 2021, 3:59 PM IST

Updated : Sep 9, 2021, 5:08 PM IST

అమెరికాకు చెందిన దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ ఫోర్డ్​ దేశంలో ఉన్న రెండు కార్ల ఉత్పత్తి ప్లాంట్లను మూసేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇకపై భారత్​లో దిగుమతి చేసుకున్న వాహనాలను మాత్రమే విక్రయించాలని భావిస్తున్నట్లు సమాచారం. కంపెనీ పునర్​వ్యవస్థీకరణ ప్రణాళికలో భాగంగా ఫోర్డ్​ ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.

రెండు ప్లాంట్లు ఇవే..

దాదాపు 2.5 బిలియన్​ డాలర్లు వెచ్చించి.. చెన్నై(తమిళనాడు), సానంద్​ (గుజరాత్​)లో రెండు ప్లాంట్లను నెలకొల్పింది ఫోర్డ్​. ఈ రెండింటి నుంచి ఎకో స్పోర్ట్​, ఫీగో, యాస్పైర్​ వంటి మోడళ్లను ఉత్పత్తి చేసేది. ఇప్పుడు ఈ ప్లాంట్లలో ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేయనుంది.

ప్లాంట్ల మూసివేతకు కారణాలు ఇవేనా?

భారత్​లో చాలా ఏళ్లుగా కార్యకలాపాలు సాగిస్తున్నా ఫోర్డ్ ఆశించిన ఫలితాలు రాలేదు. ఇతర ఆటోమొబైల్ కంపెనీల నుంచి పోటీ కూడా పెరిగిపోయింది.

మహీంద్రాతో ఒప్పందం రద్దు..

2019లో మహీంద్రా & మహీంద్రా, ఫోర్డ్ కలిసి జాయింట్ వెంచర్ ఏర్పాటు చేయాలని ఓ ఒప్పందం కుదుర్చుకున్నాయి. భారత్​లో ఫోర్డ్​ బ్రాండ్​కు మార్కెటింగ్​, పంపిణీ వ్యవహారాలు చూడటం ఈ జాయింట్ వెంచర్​ ముఖ్య ఉద్దేశం. దీనితో పాటు.. ప్రపంచవ్యాప్తంగా ఇతర మార్కెట్లలోనూ ఫోర్డ్​, మహీంద్రా వాహనాలను విక్రయ కార్యకలాపాలు కలిసి నిర్వహించేలా ఇరు సంస్థలు అవగహనకు వచ్చాయి. అయితే ఆ ఒప్పందాన్ని ఈ ఏడాది జనవరిలో రద్దు చేసుకున్నాయి. ఇరు సంస్థలు వేర్వేరుగానే కార్యకలాపాలు సాగించాలని నిర్ణయించుకున్నాయి.

ఈ కారణాలన్నింటితో పాటు.. కంపెనీ పునర్​వ్యవస్థీకరణ ప్రణాళికలో భాగంగానే భారత్​లో ఉత్పత్తి కార్యకలాపాలను నిలిపేయాలని ఫోర్డ్​ భావిస్తున్నట్లు విశ్లేషణలు వస్తున్నాయి.

దీనిపై అధికారిక ప్రకటన వెలువడితే.. భారత్​లో ఉత్పత్తి కార్యకలాపాలు నిలిపేసిన రెండో అమెరికన్ ఆటోమొబైల్ కంపెనీ కానుంది ఫోర్డ్​.

జీఎం కూడా ఇలానే..

ఇది వరకే 2017లో ఆ దేశానికి చెందిన దిగ్గజ వాహన తయారీ సంస్థ జనరల్​ మోటార్స్ (జీఎం) కూడా భారత్​లో వాహన విక్రయాలను నిలిపివేసింది. దాదాపు రెండు దశాబ్దాలు గడిచినా.. ఆశించిన ఫలితాలు దక్కలేదని అప్పట్లో జీఎం ప్రకటించింది.

అమ్మకాలు నిలిపివేసిన కారణంగా.. గుజరాత్​లో కంపెనీ ప్లాంట్​ను ఎంజీ మోటార్స్​కు విక్రయించింది. అయినప్పటికీ.. ఎగుమతుల కోసం మహారాష్ట్రలోని ప్లాంట్​లో ఉత్పత్తి కొనసాగించింది. చివరకు 2020లో అక్కడ కూడా ఉత్పత్తిని ఆపేసింది జీఎం.

ఇదీ చదవండి:ఫోర్డ్‌-మహీంద్రా జాయింట్​ వెంచర్​ ఒప్పందం రద్దు

Last Updated : Sep 9, 2021, 5:08 PM IST

ABOUT THE AUTHOR

...view details