వేగంగా విక్రయమయ్యే వినియోగ ఉత్పత్తుల (ఎఫ్‌ఎంసీజీ) దేశీయ విపణిలో అగ్రగామిగా నిలవడమే పతంజలి గ్రూపు లక్ష్యమని వ్యవస్థాపకులు బాబా రామ్‌దేవ్ పేర్కొన్నారు. వంట నూనెలు, మరికొన్ని ఉత్పత్తుల కోసం ఇతర దేశాలపై ఆధారపడుతూ, ఎంతో విలువైన విదేశీ మారక ద్రవ్యాన్ని మనదేశం కోల్పోతోందని, ఆయా విభాగాల్లో స్వయం సమృద్ధి సాధించే దిశగా ముందుకు సాగుతున్నామని వివరించారు. ఏడాదిన్నర క్రితం పతంజలి గ్రూపు అజమాయిషీలోకి వచ్చిన రుచి సోయా ఇండస్ట్రీస్‌ను లాభాల్లోకి తెచ్చామని, దీన్ని రుణరహిత కంపెనీ చేయాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. త్వరలో రుచి సోయా పబ్లిక్ ఇష్యూ ఉంటుందన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఆయిల్ పామ్‌ను పెద్దఎత్తున సాగు చేస్తున్నామని, తమ విస్తరణ ప్రణాళికల్లో రెండు తెలుగు రాష్ట్రాలకు ఎంతో ప్రాధాన్యం ఉందని 'ఈనాడు'కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ముఖ్యాంశాలివీ..
రుచి సోయా ఇండస్ట్రీస్ పూర్తిగా కోలుకున్నట్లేనా?
ఈ కంపెనీ మా చేతికి వచ్చినప్పుడు 50 శాతం 'కమొడిటీ' వ్యాపారం, 50 శాతం ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తులు ఉన్నాయి. ఇప్పుడు ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తుల వాటా 80 శాతానికి పెరిగింది. ఈ కంపెనీని పూర్తిగా పునర్‌వ్యవస్థీకరించాం. నిపుణులతో కూడిన యాజమాన్యం, బలమైన మార్కెటింగ్- పంపిణీ వ్యవస్థలు, కొత్త ఉత్పత్తుల శ్రేణి వల్ల కంపెనీ బాగా కోలుకుంది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.16,000 కోట్ల టర్నోవర్, రూ.1018 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. ఇంకా విస్తరించే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం.
పబ్లిక్ ఇష్యూకు సన్నాహాలు చేస్తున్నారు. ఎందుకు?
రుచి సోయాను మేం తీసుకున్నప్పుడు, ఎన్‌సీఎల్‌టీ (జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్) పెట్టిన నిబంధనల ప్రకారం ఈ కంపెనీలో యాజమాన్య వాటా తగ్గించుకోవాల్సి ఉంది. అందువల్ల పబ్లిక్ ఇష్యూ చేయాల్సిన అవసరం ఏర్పడింది. రుచి సోయా వృద్ధిలో భాగస్వాములయ్యే అవకాశం దేశీయ మదుపరులకు కల్పించాలనే ఆలోచనా దీని వెనుక ఉంది. రూ.4,300 కోట్ల పబ్లిక్ ఇష్యూ కోసం సెబీకి దరఖాస్తు చేశాం. కొద్ది రోజుల్లోనే అనుమతి రావచ్చు. ఇష్యూ ద్వారా సేకరించిన సొమ్ములో ఎక్కువ భాగాన్ని ఈ కంపెనీకి ఉన్న అప్పు తీర్చడానికి కేటాయిస్తాం. రుచి సోయా త్వరలోనే పూర్తి రుణ రహిత కంపెనీ అవుతుంది. ప్రస్తుతం దీనికి రూ.3,300 కోట్ల అప్పు ఉంది.
ఆ తర్వాత పతంజలి ఆయుర్వేద ఐపీఓ కూడా ఉంటుందని అంటున్నారు?
దానికి ఇంకా సమయం ఉంది. ఇప్పుడే కాదు.