తెలంగాణ

telangana

ETV Bharat / business

మాంద్యం భయాల నడుమ బ్యాంకర్లతో నిర్మలా భేటీ

మాంద్యానికి అడ్డుకట్ట వేసే దిశగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంస్కరణలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా పలు ఉద్దీపనలు ప్రకటించిన ఆమె.. నేడు ప్రభుత్వ రంగ బ్యాంకుల అధినేతలతో సమావేశం కానున్నారు. ఇటీవల ప్రకటించిన రుణ సదుపాయం పెంపు సహా.. పలు కీలక అంశాలు ఈ సమావేశంలో చర్చకు రానున్నాయి.

నిర్మలా సీతారామన్

By

Published : Sep 19, 2019, 1:01 PM IST

Updated : Oct 1, 2019, 4:40 AM IST

ప్రభుత్వ రంగ బ్యాంకుల అధిపతులతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ నేడు సమావేశం కానున్నారు. ఆర్బీఐ వడ్డీ రేట్ల తగ్గింపు... వినియోగదారులకు బదిలీ సహా పలు కీలక అంశాలపై చర్చించనున్నారు.

రెపో రేటు తగ్గింపునకు అనుగుణంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు తమ వడ్డీ రేట్లను సవరించాలని బ్యాంకింగ్ నియంత్రణ సంస్థ ఆర్​బీఐ గత నెలలో స్పష్టం చేసింది. అక్టోబర్​ 1 నుంచి ఈ విధానం అమలు చేయాలని సూచించింది. పంజాబ్ నేషనల్​ బ్యాంక్​, అలహాబాద్ ​బ్యాంక్​లు.. ఆర్​బీఐ రెపో రేటుకు తగ్గట్లుగా తమ రిటైల్​ లోన్ల వడ్డీ రేట్లు సవరించనున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి.

నేటి సమావేశంలో ఇంటివద్దే బ్యాంకింగ్​ సేవల అంశంపై బ్యాంకర్లతో సీతారామన్ చర్చించనున్నారు. ఇప్పటికే పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు.. 70 ఏళ్లు దాటిన వృద్ధులు, దివ్యాంగులకు ఇంటివద్దే బ్యాంకింగ్​ సేవలు అందిస్తున్నాయి.

సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, గృహ, వాహన సహా ఇతర రుణాల ట్రాకింగ్​కు సంబంధించి బ్యాంకులు ఎలాంటి సహాయం చేయగలవనే అంశం నేటి సమావేశంలో చర్చకు రానుంది. వీటితో పాటు ఇటీవల ప్రకటించిన బ్యాంకుల నుంచి రుణ సదుపాయం పెంపు సహా.. ఆర్థిక వృద్ధి మందగమనం వంటి అంశాలపై​ సమాలోచనలు చేయనున్నారు సీతారామన్​.

ఇదీ చూడండి: మరో ఆరు విదేశీ గమ్య స్థానాలకు ఇండియా పోస్ట్ సేవలు

Last Updated : Oct 1, 2019, 4:40 AM IST

ABOUT THE AUTHOR

...view details