గడిచిన ఆర్థిక సంవత్సరం (2019-20)లో వాస్తవిక స్థూల ప్రత్యక్ష పన్నుల ఆదాయం 4.92 శాతం తగ్గినట్లు ఆదాయ పన్ను శాఖ ప్రకటించింది. ఈ సమయంలో ప్రత్యక్ష పన్నుల ద్వారా మొత్తం రూ.12.33 లక్షల కోట్లు వసూలైనట్లు వెల్లడించింది. కార్పొరేట్లకు సుంకం తగ్గింపు, ప్రామాణిక మినహాయింపు (స్టాండర్డ్ డిడక్షన్) పెంపు, వ్యక్తిగత ఆదాయపు పన్ను రిబేట్లతో ఆదాయం తగ్గినట్లు పేర్కొంది.
ఇందులో కార్పొరేట్ సుంకాల ద్వారా రూ.6.78 లక్షల కోట్లు, వ్యక్తిగత ఆదాయపు పన్ను ద్వారా రూ.5.55 లక్షల కోట్ల ఆదాయం వచ్చినట్లు ఐటీ శాఖ వివరించింది. గత ఆర్థిక సంవత్సరానికి గానూ కార్పొరేట్లకు తగ్గించిన సుంకంతో రూ.1.45 లక్షల కోట్లు, వ్యక్తిగత ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు ఇచ్చిన రిబేట్తో కేంద్రానికి రూ.23,200 కోట్ల ఆదాయం తగ్గినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) పేర్కొంది.