ఫేస్‌యాప్.. కృత్రిమ మేధస్సుతో పనిచేసే ఈ యాప్ దాదాపు ప్రతి ఒక్కరి స్మార్ట్‌ఫోన్‌లోనూ డౌన్లోడై ఉంటుంది. ముఖాలను వృద్ధులుగా లేదా యవ్వనంగా ఎలా కావాలంటే అలా ఫిల్టర్ చేసే ఈ యాప్.. మొబైల్ యూజర్లను తెగ ఊరిస్తోంది. అయితే ఈ అప్లికేషన్ ఫోన్లలోని గోప్యమైన సమాచారాన్ని సైతం తెలుసుకోగలదనే సందేహాలు ప్రస్తుతం ట్విట్టర్ వేదికగా తలెత్తుతున్నాయి.
అంతేకాదు ఫొటోలతో పాటు ఆర్థిక (బ్యాంకు అకౌంట్లు, పిన్ నంబర్లు తదితర), ఆరోగ్య సంబంధ సమాచారాన్ని దానంతట అదే సర్వర్లోకి అప్లోడ్ చేసుకుంటోందనే అనుమానాలను వ్యక్తంచేస్తున్నారు వినియోగదారులు.
" ఇందులోని కొన్ని ఫోటోలు ఫేషియల్ రికగ్నిషన్ డేటాబేస్‌లో స్టోర్ అవడం చూస్తున్నాం. అందులో కొన్నింటిని మూడో వ్యక్తికి, మరికొన్నింటిని డేటా బ్రోకర్స్‌కు అమ్ముతున్నారు. ప్రకటనలను ఆకర్షించేందుకే వినియోగదారుల సమాచారాన్ని వాడుతున్నామని, సమాచారాన్ని మూడో వ్యక్తికి అమ్మడం లేదని సంస్థ తెలిపింది. ఫేస్ యాప్ సర్వర్‌లోని 'చాలా వరకు ఫొటోలను' 48 గంటల్లో డిలీట్ చేస్తున్నామని ప్రకటించింది. అయితే ఫొటోలన్నీ కాకుండా 'చాలా వరకు ఫొటోలు' అనడంలో అర్థమేంటి?. అది కాకుండా 48 గంటలన్నారు... ఆ సమయంలో వారు ఏం చేస్తున్నారు."