ప్రస్తుతం ఉన్న లాక్‌డౌన్ స్థితిని ఇంకా పొడిగించడం ఎంతమాత్రం మంచిది కాదని నారాయణమూర్తి అభిప్రాయపడ్డారు. ఒకవేళ అదే జరిగితే ఆకలి మరణాలు కొవిడ్-19ను మించిపోతాయన్నారు. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే దేశంలో ఈ వైరస్ కారణంగా దేశంలో మరణిస్తున్న వారి సంఖ్య చాలా తక్కువగా ఉందన్నారు. దేశంలో ఏటా వేర్వేరు కారణాల వల్ల సుమారు 90 లక్షల మంది మరణిస్తున్నారని చెప్పారు. అందులో కాలుష్యం కారణంగానే నాలుగో వంతుమంది మృత్యువాత పడుతున్నారని తెలిపారు. అదే సమయంలో కరోనా వల్ల గత రెండు నెలల్లో వెయ్యిమంది మరణించారని, దీనిపట్ల అంతగా ఆందోళన అవసరం లేదన్నారు నారాయణ మూర్తి.
అంతిమ ప్రభావం వాటిపైనే
దేశంలో సుమారు 19 కోట్ల మంది అసంఘటిత, స్వయం ఉపాధి వల్ల ఉపాధి పొందుతున్నారని, లాక్‌డౌన్ పొడిగిస్తే వీరంతా జీవనాధారం కోల్పోయే ప్రమాదం ఉందని మూర్తి హెచ్చరించారు. వ్యాపారులు కూడా 15 నుంచి 20 శాతం ఆదాయం కోల్పోతారని చెప్పారు. దీనివల్ల అంతిమంగా ప్రభుత్వానికి రావాల్సిన పన్నులు, జీఎస్‌టీ వసూళ్లపై ప్రభావం పడుతుందని చెప్పారు.