భారత్ సహా ప్రపంచ దేశాలన్నింటిలో చాలా మంది ఉద్యోగులు తమ పైఅధికారికన్నా ఆ బాధ్యతలను.. తామే సమర్థంగా నిర్వహిస్తామని భావిస్తున్నట్లు ఓ సర్వే వెల్లడించింది. వర్క్‌ఫోర్స్ ఇన్స్టిట్యూట్ ఎట్ క్రోనోస్, ఫ్యూచర్ వర్క్‌ఫోర్స్ సంస్థలు నిర్వహించిన ఈ సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.
90వ దశకంలోని ఉద్యోగుల్లో 73 శాతం మంది, 2000 సంవత్సర తొలినాళ్లలోని ఉద్యోగుల్లో 70 శాతం మంది తమ పైఅధికారి బాధ్యతలను తాము ఇంకా సమర్థంగా నిర్వహిస్తామని బలంగా విశ్వసిస్తున్నారని సర్వే తెలిపింది.
గత ఏడాది జులై 31 నుంచి ఆగస్టు 9 మధ్య.. భారత్, ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, మెక్సికో, యూకే, యూఎస్‌ల్లో 3,000 మంది ఉద్యోగులపై ఈ సర్వే జరిగింది.
గ్రేడ్ సీ, డీగా విభజించి.. కేటగిరీల ఆధారంగా వారిపై చేసిన ఈ సర్వేలో తమ పైఅధికారులు.. ఉద్యోగం-వ్యక్తిగత జీవితానికి సమ ప్రాధాన్యమివ్వడంలో మెరుగుపడాల్సిన అవసరముందని 37 శాతం మంది ఉద్యోగులు అభిప్రాయపడ్డారు. ఉద్యోగ నిర్వహణ సామర్థ్యాలు పెంచుకోవాల్సిన అవసరముందని 37 శాతం మంది తెలిపారు. పని సంబంధ వ్యవహారాల్లో మెళకువలు అవసరమని 33 శాతం మంది.. సంప్రదింపుల విషయంలో నైపుణ్యాలు పెంచుకోవాల్సిన అవసరముందని 33 శాతం మంది తమ అభిప్రాయపడ్డారు.
మొత్తంగా విధి నిర్వహణ, నైపుణ్యాల విషయంలో గ్రేడ్ ఏతో 26 శాతం, గ్రేడ్ బీతో 37 శాతం, గ్రేడ్ సీతో 25 శాతం మంది ఉద్యోగులు తమ మేనేజర్లను పాస్ చేశారు.
భారతీయుల్లో సంతృప్తే..