ప్రపంచంలోనే టాప్ పారిశ్రామికవేత్తల మధ్య విభేధాలు నడుస్తున్నాయి. ప్రస్తుతం వారి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది. వారెవరంటే ఈ కామర్స్ దిగ్గజం, అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ ఒకరు. టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ మరొకరు.
తాజగాా వీరిద్దరి మధ్య విభేధాలు బహిర్గతమయ్యాయి. జెఫ్ బెజోస్పై.. ఎలాన్ మస్క్ ట్విట్టర్ వేదికగా విమర్శలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఓ స్వీయ నియంత్రణ కార్ల కంపెనీని బెజోస్ కొనుగోలు చేయాలనుకోవడం ఈ వివాదానికి కారణమైంది.
అసలు విషయమిదే..!
టెస్లాలానే జూక్స్ అనే స్టార్టప్ కంపెనీ వాహనాల తయారీలో పలు ప్రయోగాలు చేస్తోంది. రోబోలు, పునరుత్పాదక విద్యుత్ సహా పలు సాంకేతికల ఆధారంగా నూతన ఆవిష్కరణలకు ప్రయత్నిస్తోందీ సంస్థ. అయితే ఇప్పుడు ఆ అంకుర సంస్థను 1 బిలియన్ డాలర్లతో.. జెఫ్ బెజోస్ కొనుగోలు చేయాలనుకుంటున్నట్లు వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో బెజోస్పై విమర్శనాత్మక ట్వీట్ చేశారు ఎలాన్ మస్క్.