టెస్లా షేర్లు విక్రయించేందుకు ఆ సంస్థ సీఈఓ ఎలాన్ మస్క్ ఇటీవల ట్విట్టర్లో నిర్వహించిన పోల్(Elon Musk twitter poll).. అందరి దృష్టినీ ఆకర్షించింది. తనకు సంస్థలో ఉన్న పదిశాతం షేర్లను విక్రయించడంపై సలహా ఇవ్వాలని కోరిన మస్క్.. ఫలితానికి కట్టుబడి ఉంటానని ప్రకటించారు. పోల్‌లో 57 శాతం మంది విక్రయించడానికే మొగ్గు చూపిన నేపథ్యంలో అందుకు అనుగుణంగా షేర్ల అమ్మకాన్ని ప్రారంభించారు మస్క్.
అయితే, షేరు విలువను (Musk share in Tesla) స్పెక్యులేషన్‌కు గురిచేసి మస్క్.. పన్నును ఆదా చేసుకున్నారని చాలా మంది ట్విట్టర్ యూజర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి షేర్లు (Tesla share price) అమ్మాలని గత సెప్టెంబర్ మస్క్ అనుకున్నారట. ఈ నేపథ్యంలోనే నవంబర్‌లో పోల్ నిర్వహించి కంపెనీ విలువ తగ్గేలా చేశారని అంటున్నారు.
షేర్లు పతనమైన తర్వాత..
షేర్లు విక్రయించాలని మస్క్ ట్వీట్ చేసిన తర్వాత టెస్లా షేర్లు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. పోల్ నిర్వహించిన తర్వాతి రోజు షేరు 4.84 శాతం పడిపోయింది. ఫలితంగా కంపెనీ విలువ 60 బిలియన్ డాలర్లు కోల్పోయింది. ఆ తర్వాతి రోజుల్లో కూడా కంపెనీ షేరు పతనమవుతూ వచ్చింది.