డెంగ్యూ వ్యాక్సిన్ కోసం జరుగుతున్న ప్రయత్నాల్లో మరో ముందడుగు పడింది. దీన్ని ఎదుర్కొనేందుకు తయారుచేసిన 'డెంగ్యూ ఆల్' వ్యాక్సిన్ తొలి, రెండో దశ ప్రయోగాల అధ్యయనం పూర్తైనట్లు వ్యాక్సిన్ తయారీ సంస్థ పనాసియా బయోటెక్ వెల్లడించింది. ఈ వ్యాక్సిన్ పరిశోధన ఫలితాలను సాధ్యమైనంత త్వరగా విశ్లేషించాలని.. ఇప్పటికే డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ)ను సంప్రదించినట్లు పనాసియా పేర్కొంది. ప్రస్తుతం ఉన్న నాలుగు రకాల డెంగ్యూ వైరస్ సెరోటైప్‌లను ఎదుర్కోవడంలో సమర్థంగా యాంటీబాడీల ఉత్పత్తి చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ వ్యాక్సిన్ వల్ల ఎలాంటి దుష్ప్రభావాలూ లేవని.. కేవలం సింగిల్ డోస్‌లోనే మెరుగైన ఫలితాలు ఇస్తున్నట్లు స్పష్టం చేసింది.
డెంగ్యూ వ్యాక్సిన్ అభివృద్ధిలో పురోగతి.. త్వరలో మార్కెట్లోకి!
ప్రమాదకర వ్యాధుల్లో ఒకటైన డెంగ్యూకు తొందర్లోనే వ్యాక్సిన్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. 'డెంగ్యూ ఆల్' పేరిట వ్యాక్సిన్ తొలి, రెండో దశ ప్రయోగాల అధ్యయనం పూర్తైనట్లు.. వ్యాక్సిన్ తయారీ సంస్థ పనాసియా బయోటెక్ వెల్లడించింది.
కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో డెంగ్యూని కూడా నియంత్రించగలిగితే ఆరోగ్య వ్యవస్థపై పడుతున్న తీవ్ర ఒత్తిడిని దాదాపుగా తగ్గించవచ్చని పనాసియా పేర్కొంది. కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్న వేళ.. 'డెంగ్యూ ఆల్' వ్యాక్సిన్ ప్రయోగ ఫలితాలు ఎంతో కీలకమని పనాసియా బయోటెక్ ఎండీ రాజేష్ జైన్ అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా సాధ్యమైనంత త్వరగా వ్యాక్సిన్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు రాజేష్ జైన్ పేర్కొన్నారు. తొలి రెండు దశల నివేదికల అధ్యయనం పూర్తైనట్లు పనాసియా బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీకి ఈరోజు వెల్లడించింది. దీంతో కంపెనీ షేరు విలువ ఒక్కసారిగా ఐదు శాతం పెరిగింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం.. ప్రపంచాన్ని వణికిస్తున్న అతి ప్రమాదమైన 10 వ్యాధులలో డెంగ్యూ ఒకటి. దోమల వల్ల వ్యాపించే ఈ ప్రమాదకర జ్వరం వల్ల ఏటా లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో ఈ వ్యాక్సిన్ కోసం ఇప్పటికే ఎంతో కృషి జరుగుతోంది. తాజాగా పనాసియా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ 'డెంగ్యూ ఆల్' ప్రయోగాలు కీలక దశకు చేరుకోవడం ఊరట కలిగించే విషయం.