డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ 'రెమ్‌డెసివిర్' ఔషధాన్ని దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. 'రెడిక్స్' అనే బ్రాండు పేరుతో 100 ఎంజీ వయల్ రూపంలో దీన్ని తీసుకువచ్చినట్లు డాక్టర్ రెడ్డీస్ వెల్లడించింది. యూఎస్‌కు చెందిన గిలీడ్ సైన్సెస్‌కు పేటెంట్ హక్కులు గల ఈ ఔషధాన్ని, ఆ కంపెనీతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం తాము తయారు చేసి దేశీయ మార్కెట్‌కు అందిస్తున్నట్లు వివరించింది. మనదేశంతో పాటు 127 దేశాల్లో ఈ ఔషధాన్ని విక్రయించే అవకాశం తమకు ఉన్నట్లు డాక్టర్ రెడ్డీస్ పేర్కొంది.
ఈ ఔషధాన్ని కొవిడ్-19 తీవ్రతతో ఆస్పత్రుల పాలైన బాధితులకు చికిత్సలో వినియోగిస్తున్నారు. మనదేశంలో దీనికి ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ) 'అత్యవసర వినియోగ అనుమతి' ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే గిలీడ్ సైన్సెస్‌తో ఒప్పందం కుదుర్చుకొని హెటిరో, సిప్లా, జైడస్ కేడిలా, మైలాన్ ల్యాబ్స్ 'రెమ్‌డెసివిర్' ఔషధాన్ని విడుదల చేశాయి. తాజాగా డాక్టర్ రెడ్డీస్ తన ఔషధాన్ని మార్కెట్‌కు తీసుకువచ్చింది. ఇటీవల కాలంలో కొవిడ్-19 తీవ్రత ఎక్కువై, తదుపరి అది న్యూమోనియాగా మారి ఇబ్బంది పెడుతున్న కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అటువంటి బాధితులకు ఆస్పత్రుల్లో ఐవీ ఫ్లూయిడ్ ద్వారా రెమ్‌డెసివిర్ ఔషధాన్ని ఇస్తున్న ఉదంతాలు అధికంగా ఉంటున్నాయి. ఒక్కో రోగికి అయిదు రోజుల పాటు ఆరు డోసుల మందు వాడాల్సి వస్తోంది. తత్ఫలితంగా ఈ ఔషధం వినియోగం బాగా పెరిగింది. డాక్టర్ రెడ్డీస్ 'రెడిక్స్' ఔషధం ధర ఎంతనేది వెల్లడి కాలేదు. కానీ ఇతర కంపెనీలు మాత్రం ఒక్కో డోసుకు రూ.4,000 నుంచి రూ.5,000 వరకూ ధర నిర్ణయించాయి.