దేశంలోనే అత్యంత సంపన్నమైన సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో రికార్డువైపు దూసుకెళ్తోంది. రూ. 9.5లక్షల కోట్ల మార్కెట్ విలువ అధిగమించిన తొలి సంస్థగా చరిత్ర సృష్టించిన రిలయన్స్.. తాజాగా రూ. 10లక్షల కోట్ల మైలురాయికి మరింత చేరువైంది. బుధవారం నాటి ట్రేడింగ్‌లో కంపెనీ షేర్లు రాణించడం కారణంగా కొత్త రికార్డుకు కేవలం రూ. 20వేల కోట్ల దూరంలో నిలిచింది.
నేటి సెషన్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు ధర బీఎస్‌ఈలో 2.47శాతం పెరిగి రూ. 1,547.05 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో షేరు విలువ 4.10శాతం దాకా ఎగబాకి రూ. 1,571.85 వద్ద జీవనకాల గరిష్ఠాన్ని తాకింది. అటు ఎన్‌ఎస్‌ఈలోనూ రిలయన్స్ షేరు ధర 2.56శాతం లాభంతో రూ. 1,548.50 వద్ద స్థిరపడింది.
ఇక మార్కెట్ విలువ విషయానికొస్తే.. ఇంట్రాడేలో కంపెనీ విలువ రూ. 9,96,415 కోట్ల వరకు పెరింది. చివరకు రూ. 9,80,699.59 వద్ద స్థిరపడింది. మరో రూ. 19,300 కోట్లు పెరిగితే రిలయన్స్ మార్కెట్ విలువ రూ. 10లక్షల కోట్లను అధిగమిస్తుంది. రానున్న వారాల్లో తాము కూడా మొబైల్ కాల్స్, డేటా ఛార్జీలు పెంచనున్నట్లు రిలయన్స్ జియో ప్రకటించింది. దీంతో స్టాక్‌ఎక్స్ఛేంజీల్లో కంపెనీ షేరు విలువ పెరుగుతోంది.