భారత టెక్ నిపుణులు సీఈఓలుగా వ్యవహరిస్తున్న కంపెనీల జాబితాలో తాజాగా ఐబీఎం వచ్చి చేరింది. ఆసక్తికర విషయం ఏమిటంటే... యూఎస్‌లో అధిక మార్కెట్ విలువ (మార్కెట్ క్యాపిటలైజేషన్) గల కంపెనీలకు భారత నిపుణులే సారథ్యం వహించటం.
తొలుత సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ సీఈఓగా ఎంపికైనప్పుడు.. ప్రపంచ వ్యాప్తంగా పెద్ద సంచలనం అయింది. అమెరికన్ సంస్థకు భారతీయుడు సారథ్యం వహించటం ఏమిటని వ్యాఖ్యానించారు. తదుపరి గూగుల్ సీఈఓగా సుందర్ పిఛాయ్ నియమితులు కావటం, అడోబ్‌కు శంతను నారాయణ్ నాయకత్వం వహించటం వంటి పరిణామాలతో ప్రపంచ దేశాలు మన నాయకత్వ పటిమను గుర్తించినట్లు అయ్యింది.
ఇప్పుడు తాజాగా ఐబీఎంకు భారతీయుడైన అర్వింద్ కృష్ణ సీఈఓ అయ్యారు. కంప్యూటర్ హార్డ్‌వేర్, సర్వీసెస్ విభాగంలో ఐబీఎం పేరు తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఇటువంటి ప్రతిష్ఠాత్మక కంపెనీకి సీఈఓగా భారతీయుడు ఎంపిక కావటం... మన సత్తా మరింతగా విస్తరించినట్లు అయిందని స్థానిక ఐటీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.