తెలంగాణ

telangana

ETV Bharat / business

మీ కార్డులకు ధీమా ఇచ్చే బీమా గురించి తెలుసా? - వ్యాపార వార్తలు

ప్రస్తుతం సైబర్​దాడులు స్వైర విహారం చేస్తున్నాయి. వీటి ప్రభావం ఆర్థిక లావాదేవీలపై ఎక్కువగా ఉంటోంది. మరి ఇలాంటి సమయాల్లో మీరు డెబిట్​/క్రెడిట్​ కార్డుల ద్వారా జరిపే లావాదేవీలకు రక్షణ ఉంటుందా అనే అనుమానాలు రావచ్చు. ఆ భయాలకు ధీమా కల్పించే వెసులుబాటే కార్డ్ ప్రొటెక్షన్​ ప్లాన్​లు. మరి వాటిని ఎలా పొందాలి. వాటి ఉపయోగమెంత అనే వివరాలు మీకోసం.

మీ కార్డులకు ధీమా ఇచ్చే బీమా గురించి తెలుసా?

By

Published : Nov 25, 2019, 6:53 AM IST

ప్రస్తుతం దేశంలో నగదు లావాదేవీలు భారీగా తగ్గాయి. డెబిట్​ కార్డు లేదా క్రెడిట్​ కార్డుల వినియోగం పెరిగిపోవటం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పొచ్చు. డిజిటల్​ లావాదేవీలు పెంచేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నమూ ఇందుకు కారణమే.

అయితే డిజిటల్ లావాదేవీల వృద్ధితో పాటే.. సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం డిజిటల్ లావాదేవీలు జరపడం ఎంత అవసరమో.. సైబర్​ మోసాల నుంచి మీ కార్డులను సురక్షితంగా ఉంచుకోవడం అంతే అవసరం. మీ కార్డుల రక్షణ కోసం.. పలు బ్యాంకులు, బీమా కంపెనీలు కార్డు ప్రొటెక్షన్​ పాలసీలు అందిస్తున్నాయి.

అన్ని రకాల కార్డులకూ బీమా..

  • ఆయా సంస్థలు అందించే బీమా.. క్రెడిట్ లేదా డెబిట్ కార్డుల‌కు మాత్ర‌మే కాకుండా పాన్ (శాశ్వ‌త ఖాతా సంఖ్య‌) కార్డు వంటి ముఖ్య‌మైన ప‌త్రాల‌కూ భ‌ద్ర‌త క‌ల్పిస్తుంది.
  • వివిధ ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ రంగ బ్యాంకులు ప‌లు ర‌కాల కార్డు ప్రొటెక్ష‌న్ ప్లాన్ల‌ను అందుబాటులోకి తీసుకొచ్చాయి. స‌ర్వీసు, కాల‌ప‌రిమితి ఆధారంగా వీటిని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.
  • ఎంచుకున్న స‌ర్వీసు, కాల‌ప‌రిమితికి అనుగుణంగా రూ.900- రూ.2100 మ‌ధ్య‌లో కార్డు ప్రొటెక్ష‌న్ ప్లాన్ వార్షిక ప్రీమియం ఉంటుంది.
  • ఎస్​బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు, కోటక్ మహీంద్రా బ్యాంకు, ఇండస్ఇండ్ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు వంటి అన్ని ప్ర‌ధాన‌ బ్యాంకులు కార్డు ప్రొటెక్ష‌న్ ప్రణాళికలను అందిస్తున్నాయి.

ఎలాంటి నష్టాలకు వర్తిస్తుంది?

క్రెడిట్ లేదా డెబిట్ కార్డు ఉప‌యోగించిన‌ప్పుడు జ‌రిగే నష్టం/ దొంగతనం, స్కిమ్మింగ్, నకిలీ, ఫిషింగ్, ఆన్‌లైన్ వాడకం, పిన్ ఆధారిత మోసాలకు ఈ పథకం వర్తిస్తుంది.

కార్డ్​ ప్రోటెక్షన్​ ఉపయోగాలు..

  • కార్డుకు సంబంధించి ఏదైనా న‌ష్టం/ దొంగ‌త‌నం జ‌రిగితే, దానిని గురించి నివేదించేందుకు 24 x 7 టోల్ ఫ్రీ నెంబ‌రు అందుబాటులో ఉంటుంది. వినియోగ‌దారుల కార్డు పోయినా లేదా దొంగిలించ‌బ‌డినా టోల్ ఫ్రీ నెంబ‌రుకు కాల్ చేసి కార్డును బ్లాక్‌ చేయ‌మ‌ని కోర‌వ‌చ్చు.
  • కార్డులు జారీ చేసే సంస్థ‌లైన రూపే, వీసా, మాస్ట‌ర్ కార్డ్ మొద‌లైన సంస్థ‌ల‌కు స‌మాచారాన్ని ఆయా బీమా సంస్థలే చేర‌వేస్తాయి.
  • అత్య‌వ‌స‌రంగా అన్ని కార్డులు బ్లాక్ చేయాల్సి వ‌స్తే, ఒక్కొక్క బ్యాంకుకు విడివిడిగా ఫోన్ చేసి చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఎక్కువ కార్డుల‌ను ఉప‌యోగించేవారికి ఇది చాలా ఉపయోగంగా ఉంటుంది.
  • మీ ప్ర‌యాణ స‌మ‌యంలో మీ కార్డు దొంగిలించబడినా లేదా పోయినా కార్డ్ ప్రొటెక్షన్ ప్లాన్ మీ అత్యవసర ప్ర‌యాణ ఖ‌ర్చును చూసుకుంటుంది.
  • ఈ ప్లాన్‌ కింద, బ్యాంకు లేదా బీమా సంస్థ మీ కోసం ప్రయాణ టికెట్ బుక్ చేస్తుంది. హోట‌ల్ బిల్లు వంటి వ‌స‌తి ఖ‌ర్చుల‌నూ చెల్లించే వీలుంటుంది.
  • కార్డు ప్రొటెక్ష‌న్ ప్లాన్ కింద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) రూ.6.16 ల‌క్ష‌ల వ‌ర‌కు హోట‌ల్ బిల్లును చెల్లిస్తుంది. ప్ర‌యాణ ఖ‌ర్చు కింద రూ.1.6 ల‌క్ష‌లు ఇస్తుంది.
  • అత్య‌వ‌స‌ర ప్ర‌యాణ ఖ‌ర్చు, వ‌స‌తితో పాటు అత్య‌వ‌స‌ర న‌గ‌దు ప్ర‌యోజ‌నాన్నీ కార్డ్ ప్రొటెక్ష‌న్ ప్లాన్ అందిస్తుంది. అయితే మీరు ఎంచుకున్న ప‌థ‌కం ఆధారంగా అత్య‌వ‌స‌ర న‌గ‌దు మొత్తం ఉంటుంది.

ఫ్యామిలీ ప్రొటెక్షన్​..

మీరు మాత్ర‌మే కాకుండా మీ కుటుంబ స‌భ్యుల‌ను కార్డు ప్రొట‌ెక్ష‌న్ ప్లాన్‌లో చేర్చ‌వచ్చు. ఇందుకోసం ఎటువంటి అద‌న‌పు ఛార్జీలు చెల్లించాల్సిన అవ‌స‌రం లేదు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రీమియం కార్డ్‌ ప్రొటెక్ష‌న్ ప్లాన్‌లో మీ జీవిత భాగ‌స్వామిని కూడా న‌మోదు చేసుకోవ‌చ్చు. అలాగే ఎస్‌బీఐ ప్లాటినం కార్డ్ ప్రొట‌ెక్ష‌న్ ప్లాన్​లో మీ కుటుంబంలోని న‌లుగురు స‌భ్యులు(త‌ల్లిదండ్రులు, జీవిత భాగ‌స్వామి) న‌మోదు చేసుకోవ‌చ్చు. వారికి కూడా కార్డు ప్రొట‌ెక్ష‌న్ ప్లాన్‌కి సంబంధించి అన్ని ప్ర‌యోజ‌నాల‌ు అందుతాయి.

కీలక పత్రాలకూ భద్రత..

ఈ ప్లాన్ డెబిట్, క్రెడిట్ కార్డుల‌తో పాటు దొంగిలించ‌బ‌డిన లేదా పోయిన పాన్ కార్డు వంటి ముఖ్య‌మైన ప్ర‌తాల‌కూ వ‌ర్తిస్తుంది. ఎటువంటి అద‌న‌పు రుస‌ుములు లేకుండా మీ బ్యాంకు కొత్త పాన్ కార్డును ఇస్తుంది. మీరు మీ పాస్‌పోర్ట్‌, డ్రైవింగ్ లైసెన్స్‌, స‌ర్టిఫికేట్లు, బీమా పాల‌సీల వివ‌రాల‌నూ ఇందులో న‌మోదు చేసుకునే వీలుంది.

సిమ్ బ్లాకింగ్ సదుపాయం..

ఒక‌వేళ మీ మొబైల్ ఫోన్ పోతే మీ బ్యాంక్ లేదా బీమా సంస్థ సిమ్ కార్డును బ్లాక్ చేయ‌డం మాత్ర‌మే కాకుండా కొత్త సిమ్ కార్డును ఏర్పాటు చేస్తుంది. చాలా వ‌ర‌కు ప్రొట‌ెక్ష‌న్ ప్లాన్ కార్డులు ఒక సంవ‌త్స‌ర కాల‌ప‌రిమితిని క‌లిగి ఉంటాయి.

ఇదీ చూడండి:ఆ కొత్త ఫోన్లలో 17 నిమిషాలకే బ్యాటరీ ఫుల్​!

ABOUT THE AUTHOR

...view details