తెలంగాణ

telangana

ETV Bharat / business

ఫేస్​బుక్ 'లిబ్రా' కరెన్సీ రావడం ఖాయం! - ఫేస్​బుక్​ క్రిప్టో కరెన్సీ

సర్వాత్రా విమర్శలున్నా 'లిబ్రా' డిజిటల్ కరెన్సీని అందుబాటులోకి తెచ్చేందుకు ఫేస్​బుక్ తీవ్రంగా కృషి చేస్తోంది. ఇందులో భాగంగా లిబ్రా ప్రాజెక్టులోని 21 భాగస్వామ్య సంస్థలతో జెనీవాలో తొలి సమావేశం నిర్వహించింది. విమర్శల కారణంగా పేపాల్, మాస్టర్​ కార్డ్​, వీసా​ సహా పలు దిగ్గజ సంస్థలు ఇటీవలే లిబ్రా నుంచి వైదొలగటం గమనార్హం.

లిబ్రా క్రిప్టోకరెన్సీ

By

Published : Oct 15, 2019, 6:54 PM IST

Updated : Oct 15, 2019, 7:07 PM IST

'లిబ్రా' క్రిప్టో కరెన్సీ ఆవిష్కరణ కసరత్తు ముమ్మరం చేసింది ఫేస్​బుక్​. లిబ్రాపై అమెరికా ప్రభుత్వం నుంచి తీవ్ర విమర్శలొస్తున్నా ఫేస్​బుక్ మరో ముందడుగు వేసింది. 'లిబ్రా' ప్రాజెక్టులో భాగస్వాములుగా ఉన్న 21 సంస్థలతో జెనీవాలో ఇటీవల సమావేశం నిర్వహించింది. నిజానికి 'లిబ్రా' ప్రాజెక్టు ప్రారంభించినప్పుడు మొత్తం 27 సంస్థలు భాగస్వాములుగా ఉన్నాయి. పలు ప్రభుత్వాలు లేవనెత్తిన అభ్యంతరాలు, విమర్శలతో పేపాల్, మాస్టర్​ కార్డ్​, విసా, స్ట్రైప్​, ఈబే సహా మరి కొన్ని సంస్థలు ఇటీవలే ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాయి.

పెద్ద సంస్థలు లిబ్రాను వీడుతున్నా.. వెంచర్ క్యాపిటల్ సంస్థలు మాత్రం ఇందులో కొనసాగేందుకే మొగ్గుచూపుతున్నాయి. ఉబర్, స్పాటిఫై, వొడాఫోన్ వంటి దిగ్గజాలు ఇందులో భాగస్వాములుగా ఉండటం గమనార్హం. తమతో కలిసి పనిచేసేందుకు మరో 180 సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నట్లు లిబ్రా వర్గాలు అంటున్నాయి. అయితే ఆ కంపెనీలు వివరాలు మాత్రం వెల్లడించలేదు.

సోమవారం జరిగిన సమావేశంలో ఐదుగురు సభ్యులను ఎన్నుకొని బోర్డును ఏర్పాటు చేశాయి సభ్య సంస్థలు. పేపాల్‌ మాజీ డైరెక్టర్‌ బెర్టెండ్‌ పెరెజ్‌ లిబ్రా బోర్డు సీఓఓ, తాత్కాలిక ఎండీగా నియమితులయ్యారు. ఫేస్‌బుక్‌కు చెందిన డేవిడ్‌ మార్కస్‌ బోర్డులో ఉన్నారు.

వచ్చే ఏడాది లిబ్రాను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఫేస్​బుక్ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ఇందుకు ఇంకా అధికారిక అనుమతులు లభించాల్సి ఉందని చెప్పారు.

ఇదీ చూడండి: రూ.8వేలలోపు ఉత్తమ బడ్జెట్​ స్మార్ట్​ఫోన్లు ఇవే..!

Last Updated : Oct 15, 2019, 7:07 PM IST

ABOUT THE AUTHOR

...view details