ప్రముఖ పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్‌తో పాటు మరో నలుగురిపై మోసం, కుట్ర అభియోగాలు మోపాలని ఆదేశించింది దిల్లీ ప్రత్యేక న్యాయస్థానం.
మధ్యప్రదేశ్‌లోని ఉర్తాన్ ఉత్తర బొగ్గు గని కేటాయింపు కుంభకోణం కేసుపై విచారణ చేపట్టారు ప్రత్యేక న్యాయమూర్తి భరత్ పరాశర్. నవీన్ జిందాల్ సహా నలుగురిపై భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్ 420(మోసం), సెక్షన్ 120-బి (కుట్ర) అభియోగాలు నమోదు చేయాలని ఆదేశించారు. విచారణను ఈనెల 25కు వాయిదా వేశారు.
ఆ నలుగురిలో...
జిందాల్ స్టీల్, పవర్ లిమిటెడ్ సంస్థ మాజీ డైరెక్టర్ సుశీల్ మరూ, మాజీ డిప్యూటీ ఎండీ ఆనంద్ గోయల్, ముఖ్య కార్యనిర్వాహణ అధికారి విక్రాంత్ గుజ్రాల్, సంస్థ అధికార ప్రతినిధి డీఎన్ అబ్రోల్‌పై జిందాల్‌తోపాటు అభియోగాలు నమోదు చేయాలని దిల్లీ కోర్టు ఆదేశించింది.
అలా వెలుగులోకి...
2009లో ఝార్ఖండ్‌లోని అమర్‌కొండ ముర్గదంగల్ బొగ్గు గని కేటాయింపులో అవకతవకలపై రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మధు కోడా, అప్పటి బొగ్గు శాఖ సహాయ మంత్రి దాసరి నారాయణ రావులతో పాటు నవీన్ జిందాల్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో అభియోగ పత్రం దాఖలు చేసిన కేంద్ర దర్యాప్తు సంస్థ... మధ్యప్రదేశ్ ఉర్తాన్ గని వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. నిందితులు మధ్యప్రదేశ్ బొగ్గ గని పొందడానికి స్క్రీనింగ్ కమిటీకి 2007లో సమర్పించిన దరఖాస్తులో తప్పుడు సమాచారం ఇచ్చారని అభియోగపత్రంలో పేర్కొంది. అక్రమ లాభార్జన కోసం బొగ్గు శాఖను మోసం చేశారని తెలిపింది.
ఇదీ చూడండి: పీఓకే, గిల్గిత్పై వ్యాజ్యం- పిటిషనర్‌కు జరిమానా