బీమా చేసిన వాహనం చోరీకి గురైన సందర్భాల్లో ఆ సమాచారాన్ని బీమా సంస్థకు ఆలస్యంగా అందించారన్న కారణంతో దాని క్లెయిమ్‌ను తిరస్కరించడానికి వీల్లేదంటూ సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.
జస్టిస్ ఎన్.వి.రమణ, జస్టిస్ ఆర్.సుభాష్‌రెడ్డి, జస్టిస్ బి.ఆర్.గవాయ్‌ల సారథ్యంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు తీర్పునిచ్చింది.
వాహన చోరీ విషయంపై వెంటనే పోలీసులకు సమాచారం అందించి ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినప్పటికీ బీమా సంస్థకు ఆ వివరాలను ఆలస్యంగా అందించారన్న కారణంతో క్లెయిమ్‌ను తిరస్కరించ వచ్చా? అన్న ప్రశ్నకు సర్వోన్నత న్యాయస్థానం సమాధానం ఇచ్చింది.
అది సాంకేతిక అంశం..
వాహన చోరీ విషయాన్ని బీమా సంస్థకు ఆలస్యంగా అందించారన్నది సాంకేతిక అంశం అని పేర్కొంది. అయితే, అప్పటికే పోలీసు అధికారులు దానిపై దర్యాప్తు జరిపి చోరీ నిజమని తేల్చినప్పుడు కేవలం తమకు ఆలస్యంగా సమాచారం అందించారన్న కారణంతో క్లెయిమ్ తిరస్కరించడం సహేతుకం కాదని ధర్మాసనం పేర్కొంది.
"వాహన చోరీ గురించి ఎఫ్‌ఐఆర్ నమోదుచేయడం, సదరు వాహనం కనిపించలేదంటూ పోలీసులు తుది నివేదిక ఇవ్వడం అనేవి అపహరణకు గురైన వాహనంపై బీమా మొత్తాన్ని క్లెయిమ్ చేయడానికి ఆధారాలుగా సరిపోతాయి. నమోదైన ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నట్లు చోరీ జరిగిన విషయం వాస్తవమేనని బీమా కంపెనీ సర్వేయర్ ఇచ్చే ధ్రువీకరణ కూడా స్పష్టమైన ఆధారమే అవుతుంది. అందువల్ల చోరీ విషయం ఆలస్యంగా చెప్పారన్న కారణంతో బీమా సంస్థ క్లెయిమ్‌ను తిరస్కరించడానికి వీల్లేదు" అని కోర్టు స్పష్టం చేసింది.
ఇదీ చూడండి:కేంద్రానికి షాక్!.. తగ్గనున్న ప్రత్యక్ష పన్నుల ఆదాయం