ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల్లో విస్తరించిన సీఎస్‌బీ బ్యాంక్ (గతంలో కేథలిక్ సిరియన్ బ్యాంకు) ఈ ఆర్థిక సంవత్సరంలో 20- 25 శాతం వృద్ధి సాధించాలని (CSB bank future plans) లక్ష్యంగా పెట్టుకుంది. కేరళలోని త్రిసూర్ కేంద్రంగా 8 దశాబ్దాలుగా కార్యకలాపాలు సాగిస్తున్న ఈ బ్యాంకు ఇటీవల ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో పాటు ఉత్తరాదిలోని రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో కొత్త శాఖలను (CSB bank Expansion) అధికంగా ఏర్పాటు చేస్తోంది. కొవిడ్ తగ్గినందున రిటైల్ రుణాలకు (Retail loans) గిరాకీ పెరుగుతోందని, ఇందుకు తగ్గట్లుగా విస్తరణ ప్రణాళికలతో ముందుకు సాగుతున్నామని సీఎస్‌బీ బ్యాంకు ఎండీ అండ్ సీఈఓ సివిఆర్ రాజేంద్రన్ 'ఈనాడు'ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆయన గతంలో ఆంధ్రా బ్యాంకు సీఎండీగా, అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఆఫ్ ఇండియా (యాంఫీ) సీఈఓగా పనిచేశారు.
ముఖ్యాంశాలివీ..
జూన్ త్రైమాసికంలో సీఎస్‌బీ బ్యాంకు ఆకర్షణీయ ఫలితాలు ఎలా సాధ్యమయ్యాయి
డిపాజిట్లలో 14 శాతం, రుణాల్లో 24 శాతం వృద్ధి నమోదు చేశాం. కరెంటు, సేవింగ్ ఖాతాల డిపాజిట్లను అధికంగా ఆకర్షించగలిగాం. బంగారం తనఖా రుణాలు బాగా పెరిగాయి. వ్యవసాయం, సూక్ష్మ రుణాలు అధికంగా జారీ చేశాం. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగడమే ఇందుకు కారణం.
రుణాల్లో అధిక వృద్ధికి మీ ముందున్న మార్గాలేమిటి? రిటైల్ రుణాల మీదే ఆధారపడతారా
మాది చిన్న బ్యాంకు. అందువల్ల రిటైల్ రుణాల వైపే మా మొగ్గు ఉంటుంది. మా మొత్తం రుణాల్లో బంగారం తనఖా రుణాలు 38 శాతం ఉన్నాయి. వ్యవసాయ, ద్విచక్ర వాహన, ఎంఎస్‌ఎంఈ రుణాలు సైతం అధికంగా ఇస్తున్నాం. మంచి ఖాతాలు లభిస్తే.. కార్పొరేట్ రుణాలు ఇచ్చేందుకు సిద్ధంగానే ఉన్నాం. కాకపోతే ఆయా ఖాతాలపై మాకు పూర్తి అవగాహన ఉండాలి.
నిరర్థక ఆస్తుల సమస్య ఎలా ఉంది
జూన్ త్రైమాసికంలో బంగారం రుణ ఖాతాల నుంచి మొండి బాకీలు అధికంగా ఉన్నాయి. కరోనా పరిణామాలే ఇందుకు కారణమైనందున, హామీగా పెట్టిన బంగారాన్ని వేలం వేయడం లేదు. రుణగ్రస్తులకు కొంత సమయం ఇచ్చి చూస్తాం. మిగతా విభాగాల్లోనూ రానిబాకీలు ఉంటున్నాయి. ఇందుకు తగిన కేటాయింపులు చేస్తున్నాం. ముందుముందు ఈ సమస్య కొంత తగ్గుతుంది.
మీరు నిర్దేశించుకున్న వ్యాపార లక్ష్యాలు, విస్తరణ ప్రణాళికలు ఏమిటి