కరోనా మహమ్మారి కారణంగా కార్పోరేట్ సంస్థలు ఇంటి నుంచి పని (వర్క్ ఫ్రమ్ హోమ్) విధానాన్ని అవలంబిస్తున్నాయి. కరోనా వైరస్ కట్టడి, ఉద్యోగుల మధ్య భౌతిక దూరం పాటించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ నేపథ్యంలో కార్యాలయ స్థల డిమాండ్ సుమారు 5-15 శాతం మేర తగ్గుతుందని స్థిరాస్తి రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. కానీ, డేటా గోప్యత, ఉత్పాదకత వంటి సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ సంస్థలు తమ ప్రాముఖ్యతను కోల్పోవని పేర్కొన్నారు.
అయితే.. కొవిడ్-19 తర్వాత అభివృద్ధి చెందుతున్న రంగాలు, కొత్త సంస్థల నుంచి కార్యాలయ స్థల డిమాండ్ పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
" ఇంటి నుంచి పని ద్వారా టీమ్ వర్క్, పనితీరు నిర్వహణ, ఉత్పాదకత, సృజనాత్మకత, డేటా గోప్యత, అపార్ట్మెంట్ పరిమాణాలు, ఆఫీస్‌లో మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీ వంటి సవాళ్లు ఎదురవుతాయి. ఏదైమైనా కార్యాలయ డిమాండ్‌పై సుమారు 5-15 శాతం ప్రభావం ఉంటుందని నమ్ముతున్నాం. ఆందోళన, ఒంటరితనం, ఒత్తిడి, నిరాశ కూడా ఇంటి నుంచి పని స్వీకరించడాన్ని ప్రభావితం చేస్తాయి."
– రమేశ్ నాయర్, జేఎల్ఎల్ ఇండియా సీఈఓ.
చిన్న నగరాల్లోనూ..
కరోనా మహమ్మారి అనంతరం ముందుకు వెళ్లేందుకు ఇంటి సమీపం నుంచి పని, కార్యాలయంలో పని, ఇంటి నుంచి పని వంటి మరిన్ని సూత్రాలను పాటించాల్సి వస్తుందన్నారు నైట్ ఫ్రాంక్ ఇండియా సీఎండీ శిశిర్ బైజల్.
"ఈ పరిస్థితి దీర్ఘకాలికంగా ఉంటే దేశంలోని 8 పెద్ద నగరాల్లోనే కాకుండా చిన్న పట్టణాల్లోనూ కార్యాలయాల అభివృద్ధి అవసరం పెరుగుతుంది. ప్రత్యామ్నాయ పని ప్రదేశ వ్యూహంగా ఇంటి నుంచి పనిని యాజమాన్యాలు భావించవచ్చు. కొవిడ్-19కు సరైన చికిత్స లభించే వరకు భౌతిక దూరం అనేది తప్పనిసరి. దీని ద్వారా ప్రస్తుతం ఉన్న ఉద్యోగులను సర్దుబాటు చేసేందుకు ఎక్కువ స్థలం అవసరమవుతుంది. కార్పోరేట్లు నిర్ణయాలు తీసుకోవటంలో జాప్యంతో 2020లో కార్యాలయాల స్థల లీజ్ తగ్గనుంది."