భారీ అంచనాలు, ఆశల నడుమ నేడు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ను స్వాగతించాయి పారిశ్రామిక వర్గాలు. రియాల్టీ రంగం మాత్రం అసంతృప్తి వ్యక్తం చేసింది.
"సంపద సృష్టించే వారికి గౌరవం దక్కుతుందని ఆర్థిక మంత్రి చెప్పడం.. మొత్తం బడ్జెట్లోనే నాకు నచ్చిన విషయం. ఇది వ్యాపారాలకు మరింత ఉత్తేజాన్ని, వ్యాపారులకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. నవ భారత నిర్మాణానికి మరింత పట్టుదలతో పనిచేయాలన్న సంకేతాలు పంపిస్తుంది."
-సునీల్ భారతీ మిత్తల్, భారతీ ఎంటర్ప్రైజెస్ ఛైర్మన్
ఆర్థిక వృద్ధి పెంచేందుకు బడ్జెట్లో కేంద్రం దృష్టి సారించడం, పన్ను చెల్లింపుదారులపై వేధింపులకు స్వస్తి పలికే చర్యలు చేపట్టనున్నట్లు ప్రకటించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు బయోకాన్ సీఎండీ కిరణ్ మజుందార్ షా.
"ముందు చూపు, కార్యసాధకంగా బడ్జెట్ ప్రవేశపెట్టినందుకు ఆర్థిక మంత్రికి అభినందనలు. గతంలో మౌలిక సదుపాయాలకు ప్రకటించిన రూ.102 కోట్లు సమర్థంగా వినియోగించాల్సిన అవసరం ఉంది."
-అనిల్ అగర్వాల్, వేదాంత ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్