తెలంగాణ

telangana

ETV Bharat / business

'పన్ను కోతతో పెట్టుబడుల స్వర్గధామంగా భారత్​' - శక్తికాంతదాస్​

వృద్ధికి ఊతమందించే దిశగా కార్పొరేట్ సుంకం 22 శాతానికి తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం సాహసోపేతమైందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ అభిప్రాయపడ్డారు. ఈ చర్యతో విదేశీ పెట్టుబడులు భారీగా ఆకర్షించొచ్చని తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థపై ఈ చర్య సానుకూల ప్రభావం చూపుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు దాస్​.

శక్తికాంతదాస్

By

Published : Sep 24, 2019, 4:25 PM IST

Updated : Oct 1, 2019, 8:16 PM IST

కార్పొరేట్ సుంకం తగ్గిస్తూ ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయంపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ మరో సారి ప్రశంసలు కురిపించారు. దీన్ని సహసోపేతమైన నిర్ణయంగా అభివర్ణించారాయన. గత 28 ఏళ్లలో ఇదే అత్యధిక పన్ను తగ్గింపు నిర్ణయమని పేర్కొన్నారు.

వృద్ధికి ఊతమందించే దిశగా కార్పొరేట్ సుంకాన్ని 10 శాతం మేర తగ్గిస్తూ ప్రభుత్వం గత శుక్రవారం నిర్ణయం తీసుకుంది.

ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో.. ఆసియాలో అభివృద్ధి చెందుతున్న ఇతర దేశాలకు భారత్ గట్టిపోటీ ఇస్తుందన్నారు దాస్​. విదేశీ పెట్టుబడులను భారీగా ఆకర్షించేందుకు ఈ అంశం దోహదం చేస్తుందని చెప్పుకొచ్చారు.

కార్పొరేట్​ పన్ను కోతపై శక్తికాంతదాస్​ ప్రశంసలు

"ప్రస్తుతం భారత కార్పొరేట్‌ పన్ను ఆకర్షణీయంగా మారింది. విదేశీ పెట్టుబడిదారులు, పెట్టుబడులకు సంబంధించి భారత్‌ మంచి పోటీనిచ్చే స్థాయికి చేరిందని భావిస్తున్నాను. తప్పకుండా భారీఎత్తున విదేశీ పెట్టుబడులు ఆకర్షించవచ్చు. కార్పొరేట్‌ పన్ను తగ్గింపు వల్ల దేశీయ సంస్థలు, పెట్టుబడిదారులకు కూడా పెద్దఎత్తున నగదు మిగులుతుంది. మూలధన వ్యయాన్ని పెంచుకోవచ్చు, పెట్టుబడులు విస్తరించవచ్చు. అందువల్ల కార్పొరేట్‌ పన్ను తగ్గించడం సానుకూలమైన చర్య. ఆర్థిక వ్యవస్థపై మంచి ప్రభావం చూపుతుంది." - శక్తికాంతదాస్​, ఆర్బీఐ గవర్నర్

అక్టోబర్ 1 నుంచి 4 వరకు ఆర్బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్ష జరగనున్న నేపథ్యంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​తో సమావేశమయ్యారు శక్తికాంతదాస్. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ అంశాలను తెలిపారు.

ఇదీ చూడండి: పెట్రో​ ధరలు మరింత పైకి.. నేడు ఎంత పెరిగాయంటే!

Last Updated : Oct 1, 2019, 8:16 PM IST

ABOUT THE AUTHOR

...view details