తెలంగాణ

telangana

ETV Bharat / business

కరోనా దెబ్బతో సుడిగుండంలోనే ఎమ్​ఎస్​ఎమ్ఈ​లు

కరోనా మహమ్మారి తెచ్చిన ఆర్థిక సంక్షోభం నుంచి ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలు ఇంకా బయటపడనేలేదు. తమ ఉత్పత్తులకు గిరాకీ లేక, తమ ఖాతాదారుల నుంచి రావాల్సిన డబ్బు రాక, సరఫరాదారులకు, బ్యాంకులకు చెల్లించాల్సిన బకాయిలు, వడ్డీలు పేరుకుపోయాయి. దీంతో.. స్వయం ఉపాధి కల్పించుకున్నవారిలో 37శాతం తాము ఇక కోలుకోవడం అసంభవమని భావిస్తున్నట్లు ఓ అధ్యయనంలో తేలింది. మరి ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్దీపనలు ఏమేరకు పనిచేయనున్నాయి?

corona effect on msme organizations in india
కరోనా దెబ్బ నుంచి కోలుకునేదెలా?

By

Published : Jun 30, 2020, 10:45 AM IST

అసలే ఆర్థిక మందగతితో కునారిల్లుతున్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ (ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ)ల మీద- గోరుచుట్టుపై రోకటిపోటులా కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ వచ్చిపడ్డాయి. ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలలో 35శాతం, స్వయం ఉపాధి కల్పించుకున్నవారిలో 37శాతం తాము ఇక కోలుకోవడం అసంభవమని భావిస్తున్నట్లు భారత ఉత్పత్తిదారుల సంఘం (ఐమో) మే నెలలో జరిపిన అధ్యయనం వెల్లడించింది. కేంద్రం ఆత్మనిర్భర్‌ పథకం కింద ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈల రంగానికి ఉద్దీపన ప్రకటించినా- వాటిలో అత్యధికం ఇప్పటికీ జీతాలు చెల్లించడానికి, దైనందిన వ్యాపార నిర్వహణకు డబ్బు లేక అష్టకష్టాలు పడుతున్నాయి. భారత పారిశ్రామిక మండళ్ల సమాఖ్య (సీఐఐ) లెక్క ప్రకారం- దేశంలో 6.3 కోట్ల ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలు ఉండగా, వాటిలో 27శాతం సంస్థల చేతిలో ఇప్పుడు చిల్లిగవ్వ లేదు. 47శాతం యూనిట్ల వద్ద మాత్రమే కేవలం నెల రోజుల ఖర్చులకు సరిపడా డబ్బు ఉంది. భారత్‌ జీడీపీకి 29శాతం వాటా అందించే ఈ పరిశ్రమలు 11 నుంచి 15 కోట్లమందికి ఉపాధి కల్పిస్తున్నాయని అంచనా. వీరిలో చాలామంది కొవిడ్‌ దెబ్బకు సొంత ఊళ్లకు తిరిగి వెళ్లిపోయారు. లాక్‌డౌన్‌ భయాలు ఇప్పటికీ తొలగకపోవడంతో వ్యాపారాలు ఇంకా గాడిన పడలేదు. ఈ పరిస్థితిలో 70శాతం ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలు ఉద్యోగుల బలగాన్ని తగ్గించుకోవాలని చూస్తున్నాయని ఐమో వెల్లడించింది. చాలా సంస్థల్లో తొలగింపులూ చోటుచేసుకున్నాయి.

భవిష్యత్తుపై ఆందోళన

కరోనా దెబ్బ నుంచి కోలుకునేదెలా?

కరోనా కాలంలో తమ ఉత్పత్తులకు గిరాకీ లేకపోవడం, సరఫరాదారులకు, బ్యాంకులకు చెల్లించాల్సిన బకాయిలు, వడ్డీలు పేరుకుపోవడం, తమ ఖాతాదారుల నుంచి రావలసిన డబ్బు రాకపోవడం, జీతాలు చెల్లించే స్థోమత లేకపోవడం- ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈల దుస్థితికి మూల కారణాలు. స్వయంఉపాధి కల్పించుకున్న వ్యవస్థాపకుల్లో 36 శాతం ఇదే ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. ఆర్థిక సంస్థలకు నెలసరి వాయిదా(ఈఎంఐ)లు కట్టలేకపోవడం, గతంలో చేసిన పనులకు డబ్బు కానీ, కొత్త ఆర్డర్లు కానీ రాకపోవడం- ఒకవేళ వచ్చినా గిట్టుబాటు కాకపోవడం వంటి సమస్యలు... పరిశ్రమలను దెబ్బతీస్తున్నాయి. చిన్న పరిశ్రమలకు లభించే ఆర్డర్లలో అత్యధిక శాతం భారీ కంపెనీల నుంచి వస్తాయి. వాటికి విడి భాగాలు సరఫరా చేయడం, చిన్న కాంట్రాక్టులు పొందడం ద్వారా వ్యాపారం సాగిస్తాయి. కరోనా వల్ల భారీ కార్పొరేట్ల వ్యాపారమూ దెబ్బతిన్నందున ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలను ఆదుకునే నాథుడు లేకుండాపోయాడు. వ్యాపారం లేక 40శాతం కార్పొరేట్‌ సంస్థలూ ఉద్యోగులను తొలగించాలనుకుంటున్నాయని ఐమో వెల్లడించింది. పైగా, అవి కొత్త ఉద్యోగులను తీసుకోవడమూ నిలిపేశాయి. మొత్తం ఉద్యోగ నష్టం ఎంతో ఆగస్టు 20నాటికి తేలుతుందని ఐమో వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ పరిశ్రమల యజమానులు మొదలుకొని- స్వయంఉపాధి వ్యవస్థాపకులు, కార్మికుల వరకు అందరూ రేపు గడిచేదెలా అని ఆందోళనకు లోనవుతున్నారు. ఈ దురవస్థ నుంచి ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలు బయటపడాలంటే జీతభత్యాలకు, నిర్వహణ ఖర్చులకు ఆర్థిక సహాయం చేయడం తప్పనిసరి. మారిన పరిస్థితుల్లో ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలకు అప్పులివ్వడానికి ప్రైవేటు బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు ముందుకు రానందువల్ల ప్రభుత్వమే ఈ యూనిట్లకు ఆర్థిక సహాయం చేయాలని గుర్తించి ప్యాకేజీ ప్రకటించింది.

ఉద్దీపనతో ఉపయోగమెంత?

ఉద్దీపనతో ఉపయోగమెంత?

కేంద్రం ప్రకటించిన మూడు లక్షల కోట్ల రూపాయల ఉద్దీపన ప్యాకేజీ ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలను ఏ మేరకు ఆదుకొంటుందనేది ప్రశ్న. ఈ ప్యాకేజీ వల్ల 45 లక్షల యూనిట్లకు మేలు జరుగుతుందని ప్రభుత్వం చెబుతోంది. కానీ, దేశంలో మొత్తం 6.3 కోట్ల చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఉన్నాయని గుర్తుంచుకుంటే, ఈ సహాయం సముద్రంలో నీటిబొట్టంత అని ఇట్టే అర్థమవుతుంది. ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలు తీసుకున్న రుణాల్లో 20 శాతానికి సమాన మొత్తాన్ని కేంద్ర పూచీకత్తుపై ఎమర్జెన్సీ రుణంగా ఇస్తామని ప్రకటించారు. చిన్న పరిశ్రమలు బ్యాంకు రుణాల కోసం ఇప్పటికే ఆస్తులను పూచీకత్తుగా చూపి ఉన్నాయి కనుక, నికరంగా ఒరిగేది స్వల్పం. ప్రపంచవ్యాప్తంగా ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలను టర్నోవరు ప్రాతిపదికపై వర్గీకరించి, ఆర్థిక సహాయం చేస్తున్నారు. భారతదేశం కూడా ఇదే ప్రాతిపదికను లేదా నిర్వచనాన్ని స్వీకరించడం స్వాగతించాల్సిన అంశం. టర్నోవరు ఆధారంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా యూనిట్లుగా వర్గీకరించడం వల్ల ఆర్థిక సంస్థలు రుణాలు ఇవ్వడం తేలికవుతుంది. ఈ పరిశ్రమలు చెప్పే లెక్కలను అనుమానంగా చూసే బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు టర్నోవరును నికరమైన గీటురాయిగా పరిగణిస్తాయి. గతంలో దేశంలోని ఆరు కోట్ల పైచిలుకు ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈల్లో 90 శాతం సూక్ష్మ యూనిట్లుగా పరిగణన పొందేవి. కొత్త నిర్వచనం ప్రకారం, అంటే టర్నోవరు ప్రాతిపదికన 50 లక్షల యూనిట్లు మధ్యతరహా సంస్థల హోదా పొంది కేంద్ర ఆర్థిక సహాయం అందుకోనున్నాయి. మొత్తంమీద ఎక్కువ పెట్టుబడి పెట్టిన సంస్థలకు ప్రభుత్వ సాయం అందుతుంది.

గిరాకీ పెరిగితేనే...

స్థూలంగా కరోనాకు ముందే ఆర్థిక మందగతి వల్ల అనేకానేక యూనిట్ల టర్నోవరు పడిపోయింది. లాక్‌డౌన్‌తో పరిస్థితి మరింత విషమించింది. భారీ కార్పొరేట్లదీ ఇదే పరిస్థితి. వాటి నుంచి ఆర్డర్లు నిలిచిపోవడం వల్ల 90శాతం ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలు అవస్థలు పడుతున్నాయి. అయినా సరే- ప్రభుత్వం కనుక బేషరతుగా లేదా సులభ నిబంధనలపై రుణ సహాయం చేస్తే రెండు మూడేళ్లలో కోలుకొంటామని కొన్ని మధ్యతరహా యూనిట్ల యజమానులు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. భారీ కంపెనీల పరిస్థితి దివ్యంగా ఉంటే ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈల స్థితీ ఉజ్జ్వలంగా ఉండాలి. కానీ, కార్పొరేట్‌ సంస్థలు తమ ఆర్డర్లపై ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలకు దక్కే లాభాల్లో ఎప్పటికప్పుడు కోత పెడుతూ, చివరకు రెండు నుంచి అయిదు శాతం మాత్రం మిగిలేలా చూస్తున్నాయని ఆరోపణ. దీన్ని భరించలేనివారు వ్యాపారాన్ని వివిధ విభాగాలకు విస్తరిస్తున్నారు. మరోవైపు కరోనా కల్లోలం వల్ల కార్పొరేట్‌ సంస్థలు కొత్త టెక్నాలజీలకు మారుతూ, తమ సంప్రదాయ సరఫరాదారులైన ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలకు దూరం జరుగుతున్నాయి. లేదా కొత్త సాంకేతికతలను చేపట్టాలంటున్నాయి. ఈ మార్పులను తట్టుకోలేని చిన్న పరిశ్రమలు వ్యాపారం నుంచి నిష్క్రమించాల్సి వచ్చేట్లుంది. దీన్ని నివారించడానికి నవీకరణ సాధించే ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలకు నిధులు అందిస్తామని ప్రభుత్వం 2017లోనే ప్రకటించినా, అది పూర్తిస్థాయిలో కార్యరూపం దాల్చలేదు. అదీకాకుండా కరోనా కల్లోలంలో దేశ ప్రజల కొనుగోలు శక్తి, కంపెనీల ఆదాయం పడిపోయాయి. ఫలితంగా వస్తుసేవలకు గిరాకీ తగ్గి ఉత్పత్తి స్తంభించిపోయింది. ఇంతకాలం భారత జీడీపీ వృద్ధికి ఊతమిచ్చింది ప్రైవేటు పెట్టుబడులో, ప్రభుత్వ ప్యాకేజీలో కావు- వినియోగదారుల వ్యయంతోనే జీడీపీ పెరుగుతూ వచ్చింది. సూక్ష్మస్థాయి నుంచి భారీ కార్పొరేట్ల వరకు సంక్షోభం నుంచి బయటపడితేనే నిరుద్యోగం తగ్గుతుంది. జనం చేతిలో మళ్లీ డబ్బు ఆడి గిరాకీ పెరుగుతుంది. ఈ దిశగా ప్రభుత్వం కొత్త ఆలోచనలతో ముందుకురావాలి!

ఇదీ చదవండి:ఒక్క ఐడియాతో వారి జీవితం సూపర్ హిట్​

ABOUT THE AUTHOR

...view details