చైనాలో కరోనా వైరస్ తీవ్రత ఎక్కువ కాలం కొనసాగితే మనదేశంలో ఔషధ పరిశ్రమకు ఇబ్బందేనని లారస్ ల్యాబ్స్ వ్యవస్థాపకుడు, సీఈఓ డాక్టర్ చావా సత్యనారాయణ అభిప్రాయపడ్డారు. ఇప్పటికి అయితే దీని ప్రభావం దేశీయ పరిశ్రమ మీద లేదని పేర్కొన్నారు. బల్క్ ఔషధాలు, ఏపీఐ ఔషధాల విషయంలో ఎంతగా స్వయం సమృద్ధి సాధించేందుకు ప్రయత్నించినా, ఎంతో కొంతమేరకు చైనా మీద ఆధారపడక తప్పనిసరి పరిస్థితి మనకు ఉందని ఆయన స్పష్టం చేశారు. లారస్ ల్యాబ్స్ తన తయారీ సామర్థ్యాన్ని ఇంకా పెంచుకునే సన్నాహాల్లో ఉన్నట్లు వెల్లడించారు. క్రామ్స్ (కాంట్రాక్టు పరిశోధన- తయారీ సేవలు) విభాగంలో విస్తరించే ఆలోచన తమకు ఉందని పేర్కొన్నారు. చైనా నుంచి బల్క్ ఔషధాల లభ్యత, ఔషధ పరిశ్రమ తీరుతెన్నులు, లారస్ ల్యాబ్స్ వ్యవహారాలపై ఆయన 'ఈనాడు'కు ఇచ్చిన ఇంటర్వూలో తన అభిప్రాయాలు వెల్లడించారు. ఆ విశేషాలు..
చైనాలో కరోనా వైరస్ ప్రబలి ఎంతో మంది ప్రాణాలు కోల్పోవటం వల్ల అక్కడి నుంచి బల్క్ ఔషధాలు, ఏపీఐల సరఫరా మనదేశీయ ఔషధ పరిశ్రమకు నిలిచిపోయి ఇబ్బందులు కలుగుతున్నాయా?
ఇప్పటికి అయితే ప్రభావం లేదు. చైనాలో చంద్ర సంవత్సరాన్ని పాటించటం వల్ల ఇటీవల వరకు అక్కడ సెలవులు ఉన్నాయి. అందువల్ల దేశీయ ఔషధ సంస్థలు ముందుగానే బల్క్ ఔషధాలు, ఏపీఐ ఔషధాలను అధికంగా నిల్వ చేసుకున్నాయి. ప్రస్తుతం అక్కడి నుంచి తగినంతగా సరఫరాలు లేనప్పటికీ, చేతిలో ఉన్న నిల్వలను వినియోగించుకునే అవకాశం ఉన్నందున ఔషధాల తయారీకి ఇబ్బందులు ఎదురుకాలేదు. కానీ ఈ నిల్వలు అయిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. మార్చి నెలాఖరు నాటికి పరిస్థితులు మెరుగుపడి, చైనా నుంచి సరఫరాలు పెరగాలి. అప్పుడు ఇబ్బంది ఉండదు. కానీ వైరస్ సమస్య ఇంకా ఎక్కువ కాలం కొనసాగిన పక్షంలో సమస్యలు ఎదురుకావచ్చు.
బల్క్ ఔషధాల సరఫరా కోసం చైనా మీద అధికంగా ఆధారపడటం వల్ల సమస్య తలెత్తుతోంది. ఏడాదిన్నర క్రితం అక్కడ కాలుష్య సమస్యలతో బల్క్ ఔషధాల సరఫరా తగ్గింది. ఇప్పుడు కరోనా వైరస్ సమస్య వచ్చింది. రేపు మరొకటి..? ఇలా తరచుగా అవాంతరాలు ఎదురుకాకుండా ఈ విభాగంలో స్వయం సమృద్ధి సాధించలేమా?
కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ పూర్తిగా సాధ్యం కాదు. రసాయన శాస్త్రంలో మన పొరుగు దేశానికి విశేష నైపుణ్యం ఉంది. పెట్రోలు, సహజవాయువు, బొగ్గు ఆధారిత రసాయనాల తయారీ అక్కడ ఎంతో అధికంగా జరుగుతోంది. ఔషధాల తయారీకి ప్రాథమిక రసాయనాలు తప్పనిసరి. అన్నింటినీ మనం తయారు చేసుకోలేం కదా. అందువల్ల ఎంతోకొంత మేరకు చైనాపై ఆధారపడక తప్పదు. కాకపోతే బాగా తగ్గించుకోవడం, ప్రత్యామ్నాయ సరఫరా ఏర్పాట్లు చేసుకోవడం అవసరం.
లారస్ ల్యాబ్స్ గత రెండు, మూడేళ్లలో పెద్దఎత్తున విస్తరణ చేపట్టింది. దాని ఫలితాలు కనిపిస్తున్నాయా?