తమ పోర్ట్‌ఫోలియోలో డీజిల్ మోడళ్లకు బలమైన డిమాండ్‌ను సాధిస్తున్నట్టు హ్యుందాయ్ మోటర్స్ ఇండియా తెలిపింది. బీఎస్-6 ఉద్గారాల మోడళ్లలోనూ అదే సాంకేతిక పరిజ్ఞానాన్ని కొనసాగించాలనే తమ వైఖరి సరియైనదేనని ఈ పరిణామాలు నిరూపిస్తున్నాయని కంపెనీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
ఈ ఏడాది ఏప్రిల్ నుంచి బీఎస్-6 ఉద్గార నియమాలు అమలులోకి వచ్చాయి. ఈ క్రమంలో డీజిల్ మోడళ్లకు స్వస్తి పలకాలని దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజూకీ నిర్ణయించింది. అయితే, దేశ రెండో అతిపెద్ద ప్రయాణ వాహనాల తయారీ సంస్థ అయిన హ్యుందాయ్ మోటర్స్.. తమ పోర్ట్‌ఫోలియోలో డీజిల్ వాహనాల ఉత్పత్తిని కొనసాగించాలని నిర్ణయించటం గమనార్హం.
పలు వాహన తయారీదారులు డీజిల్ వాహనాలు, ముఖ్యంగా చిన్న కెపాసిటీ ఇంజిన్ల ఉత్పత్తిని నిలిపేయాలని నిర్ణయించాయి. చిన్న డీజిల్ కార్లు ఖరీదైనవిగా మారి, తొలిసారి కారు కొనాలనుకునే వారికి ప్రియంగా మారుతాయని భావిస్తుండటమే ఇందుకు కారణం. టాటా మోటర్స్, టయోటా కిర్లోస్కర్ వంటి సంస్థలు ఇప్పటికే చిన్న సామర్థ్యం గల డీజిల్ ఇంజిన్లను పక్కనపెట్టాయి. బహుళ ప్రయోజన వాహనాలు, ఎస్‌యూవీల్లో అధిక సామర్థ్యం గల పవర్‌ట్రైన్స్ ఇంజిన్లనే వినియోగిస్తున్నాయి.
డీజిల్ వాహనాలకే జై..
క్రేటాలో ఇప్పటికీ 60 శాతం మంది డీజిల్ వాహనాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని పేర్కొన్నారు హ్యుందాయ్ మోటర్స్ డైరెక్టర్ (సెల్స్, మార్కెటింగ్, సర్వీస్) తరుణ్ గార్గ్. వెన్యూ, వెర్నా వాహనాల్లోనూ 33శాతం మంది వినియోగదారులు డీజిల్ కార్లనే కోరుకుంటున్నట్లు తెలిపారు.