వాట్సాప్ తీసుకొచ్చిన నూతన గోప్యతా నిబంధనలను అమలు చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని దిల్లీ హై కోర్టును కోరింది కేంద్రం. వాట్సాప్ నూతన పాలసీలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌కు.. స్పందనగా సమర్పించిన అఫిడవిట్లో ఈ విషయాలు పేర్కొంది ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ.
వాట్సాప్ నూతన గోప్యతా విధానాలను సవాలు చేస్తూ.. సీమా సింగ్, మేఘన్ సింగ్, విక్రమ్ సింగ్ అనే వ్యక్తులు దిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. వాట్సాప్ పాలసీలు.. భారతీయ డేటా, గోప్యత విధానాల్లో లోపాలను ఎత్తిచూపుతున్నట్లు అందులో పేర్కొన్నారు.
ఈ విషయంపై ఏప్రిల్ 20న తదుపరి విచారణ జరపనుంది చీఫ్ జస్టిస్ డీఎన్ పటేల్, జస్టిస్ జస్మీత్ సింగ్‌తో కూడిన ధర్మాసనం.
అభ్యంతరం ఇందుకే..
కొత్త నిబంధనల ప్రకారం.. షరతులకు అంగీకరిస్తేనే యూజర్ యాప్ వాడేందుకు వీలుంటుంది. లేదంటే వాట్సాప్ పని చేయదు. మాతృసంస్థ ఫేస్బుక్, ఇతర థర్డ్ పార్టీ యాప్‌లతో డేటా షేర్ చేయాలా వద్దా అని ఎంపిక చేసుకునే సౌకర్యం మాత్రం యూజర్‌కు లేదు. వాట్సాప్ కొత్త నిబంధనలు మే 15 నుంచి అమలు కానున్నాయి.
ఐటీ రూల్స్‌పై కేంద్రానికి నోటీసులు..
డిజిటల్ న్యూస్ మీడియాకు సంబంధించి కేంద్రం తీసుకొచ్చిన కొత్త ఐటీ నిబంధనలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పైనా దిల్లీ హై కోర్టు విచారణ చేపట్టింది. దీనిపై స్పందన తెలపాలని ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ, బ్రాడ్‌కాస్టింగ్ మంత్రిత్వ శాఖకు నోటీసులు జారీ చేసింది. కేంద్రం స్పందన తెలిపేందుకు కొంత సమయాన్ని కేటాయించింది.
ఈ పిటిషన్‌పై తదుపరి విచారణ ఏప్రిల్ 16కు వాయిదా వేసింది ధర్మాసనం. అదే రోజున మీడియాకు సంబంధించిన పలు పాత కేసులు కూడా విచారణకు రానున్నాయి.
ఇవీ చదవండి: