వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు పెంచేందుకు.. వినియోగదారులకు లాటరీ పథకాన్ని తీసుకురావాలని ఆర్థిక మంత్రిత్వశాఖ భావిస్తోంది. పన్ను ఎగవేతలను అరికట్టి, నిఘా పటిష్ఠం చేసేందుకు ఈ పథకం తోడ్పడుతుందని ఓ సీనియర్ అధికారి తెలిపారు.
ఈ పథకం ద్వారా రోజువారీ, నెలవారీ పద్ధతిలో లాటరీలు తీయనున్నట్లు వివరించారు. ఏదైనా కొనుగోలు జరిపి, జీఎస్టీ చెల్లించిన వినియోగదారులకు ఈ పథకం వర్తించనున్నట్టు వెల్లడించారు.
విజేతల ఎంపిక ఇలా..
ఏదైనా వస్తువు, సేవకు జీఎస్టీతో సహా డబ్బులు చెల్లించాక వ్యాపారుల నుంచి వినియోగదారులు బిల్లు తీసుకోవాలి. ఆ బిల్లును ఓ ప్రత్యేక పోర్టల్ లేదా యాప్ ద్వారా అప్లోడ్ చేయాలి. యాప్ ద్వారా ఫోన్ నెంబర్, వ్యాపారుల జీఎస్టీ సంఖ్య వంటివి ఆటోమేటిక్‌గా తీసుకుంటారు. విజేతల ఎంపిక కూడా ఆన్లైన్లోనే జరుగుతుంది.
లాటరీ పథకం కోసం ప్రత్యేక యాప్ లేదా పోర్టల్‌ను రూపొందించాల్సి ఉందని ఆ అధికారి చెప్పారు. అధికారుల స్థాయిలో ఈ పథకంపై ఒక అవగాహనకు వచ్చిన తర్వాత.. జీఎస్టీ మండలి ముందు ఈ కొత్త ప్రతిపాదనను ఉంచనున్నట్లు పేర్కొన్నారు.